– 250 గజాల్లో ఐదు అంతస్తుల అక్రమ భవనం
– మౌనం పాటిస్తున్న సర్కిల్ అధికారులు
– చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు
నేటి సాక్షి, నార్సింగి (శివకుమార్): సర్కిల్ పరిధిలోని కోకాపేట్ గ్రామంలో అక్రమ నిర్మాణాలు హద్దులు దాటుతున్నాయి. కేవలం 250 గజాల స్థలంలో అనుమతులకు విరుద్దంగా సెల్లార్‌తో కూడిన ఐదు అంతస్తుల భారీ భవన నిర్మాణం ఏదేచ్ఛగా కొనసాగుతోంది. ఇంత భారీ నిర్మాణం జరుగుతున్నా సంబంధిత సర్కిల్ అధికారులు మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి. అనుమతులు లేకుండా సెల్లార్ ఎలా తవ్వారు? ఐదు అంతస్తులకు ఎలా అనుమతి ఇచ్చారు? ఫైర్ సేఫ్టీ అనుమతులు ఎక్కడ? నిబంధనలు ఈ ప్రాంతంలో వర్తించవా? అనే ప్రశ్నలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. చిన్నపాటి ఇల్లు నిర్మించాలంటేనే సామాన్యుడిని నిబంధనల పేరుతో వేధించే అధికారులు, ఇంతటి అక్రమ భవనంపై మాత్రం కళ్లుమూసుకుని ఎందుకు ఉన్నారు.? ఈ అక్రమ నిర్మాణం వెనుక అధికారుల అండదండలు మెండుగా ఉన్నాయని స్థానిక ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పటికీ నిర్మాణాన్ని నిలిపివేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికే నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి,అక్రమ భవనాన్ని వెంటనే సీజ్ చేసి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.





