నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 18 ~అన్నమయ్య జిల్లా -:- ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద గురువారం కోటి సంతకాల ప్రతులతో కూడిన వాహనాలను వైయస్ జగన్ మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి లోక్ భవన్‌కు పంపించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు, విడుదల రజిని హైలెట్ గా నిలిచారు. అన్ని జిల్లాల నుంచి తాడేపల్లికి చేరుకున్న కోటి సంతకాల సేకరణ ప్రతుల వాహనాలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించేందుకు ఈ ఉద్యమాన్ని చేపట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, కీలక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వాహనాలు ర్యాలీగా విజయవాడలోని లోక్ భవన్‌కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నేతలు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమం హోరుగా కొనసాగింది. ఈ ఉద్యమంలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘన విజయం సాధించింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే కోటి 4 లక్షల 11 వేల 136 మంది ప్రజలు తమ సంతకాలు చేసి, ప్రభుత్వ నిర్ణయంపై తమ వ్యతిరేకతను స్పష్టంగా వ్యక్తం చేశారని వెల్లడించారు. రాష్ట్ర మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించిందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైన నారావారిపల్లెలో వున్న ప్రజలు పెద్ద సంఖ్యలో సంతకాలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ఇది ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తోందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రం వైయస్ జగన్ కీలక నేతలతో కలిసి లోక్ భవన్‌కు వెళ్లి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా గళాన్ని గవర్నర్ నజీర్ అహ్మద్ కు విన్నవించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని దీనిపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలని గవర్నర్ ను వైయస్ జగన్ కోరారు..~~~~~~~~~~~~~~~~~~





