నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రవైటేకీరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణలో చంద్రగిరి నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. మూడు రోజులకు ముందుగానే (ఈనెల 8వ తేదీ ఆదివారం) కోటి సంతకాల సేకరణకు సంబంధించిన ప్రతులను మండలాల నుంచి తీసుకువచ్చి నియోజక వర్గ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు అప్పగించారు. అనంతరం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కష్టపడి సంతకాలు సేకరించిన వారందరికీ ఆత్మీయ విందును ఏర్పాటు చేసి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. అనంతరం మండలాల వారీగా సేకరించిన సంతకాల ప్రతులను ప్రత్యేకంగా తయారు చేయించిన అట్టపెట్టెల్లో పెట్టి సీల్ వేయించారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బుధవారం తిరుపతి జిల్లా పార్టీ కార్యాలయంకు ప్రత్యేక వాహనంలో తరలించారు. తిరుపతి పద్మావతీపురంలోని జిల్లా పార్టీ కార్యాలయంకు తీసుకువెళ్లిన చంద్రగిరి నియోజకవర్గ కోటి సంతకాల ప్రతులను జిల్లా పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డికి అప్పగించారు. అయితే ఈ అప్పగింత కార్యక్రమంలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిలు అందుబాటులో లేనందున హాజరుకాకపోవడంతో స్థానిక పార్టీ నేతలు తీసుకువెళ్లి జిల్లా పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డికి అప్పగించారు. *116 పంచాయతీలు 1,16,000 సంతకాలు*చంద్రగిరి నియోజకవర్గంలోని 116 గ్రామ పంచాయతీలు, 108 గ్రామ సచివాలయల పరిధిలోని పల్లెల్లో కోటి సంతకాల ప్రజా ఉధ్యమాన్ని స్థానిక పార్టీ నేతలు ప్రతి ఇంటికీ తీసుకు వెళ్లారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం వల్ల కలిగే ఇబ్బంది, జరిగే నష్టాలను వివరించి వారి నుంచి సంతకాలు సేకరించారు. రాజ్యాంగ బద్ధంగా గవర్నర్‌ను కలసి ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన ఒకేఒక్క పిలుపుతో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో ఏ నియోజకవర్గం చేయనంతగా చంద్రగిరి నుంచి అత్యధిక సంతకాలు సేకరించి అందించడంతో భూమన కరుణాకర్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలను అభినందించారు.





