నేటి సాక్షి – కోరుట్ల*(రాధారపు నర్సయ్య)తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘99 రోజుల ప్రణాళిక’లో భాగంగా సోమవారం ఉదయం కోరుట్ల పట్టణంలో ‘2కే రన్’ను ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక కృష్ణా మందిరం వద్ద ప్రారంభమైన ఈ పరుగులో మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత, మున్సిపల్ కమిషనర్ రవీందర్, కౌన్సిలర్లు, యువతీ యువకులు మరియు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.*పరిశుభ్రతపై అవగాహన*ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత మాట్లాడుతూ.. పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి వార్డులో శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించాలని, కౌన్సిలర్లు తమ వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.*ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలి*మున్సిపల్ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ కోరుట్లను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల వద్దే తడి, పొడి, హానికర చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ బట్ట సంచులను వెంట తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత, మున్సిపల్ కమిషనర్ రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్లు, పురపాలక సంఘం సిబ్బంది, పట్టణ యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలో పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.__________





