నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల నియోజకవర్గంలో చెస్ క్రీడను ప్రోత్సహించే దిశగా మరో ముందడుగు పడింది. కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అభ్యర్థన మేరకు చెస్ నెట్వర్క్ ఫౌండేషన్ సహకారంతో కోరుట్ల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు 250 ఉచిత చెస్ బోర్డులను ఎమ్మెల్యే సంజయ్ స్వయంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక చెస్ బోర్డు అందేలా విస్తృత కార్యక్రమం చేపట్టినట్టు ఎమ్మెల్యే తెలిపారు.*సెల్‌ఫోన్ బదులు చెస్ – మానసిక దృఢత్వం కోసం*ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడిన డాక్టర్ సంజయ్, గ్రామీణ ప్రాంత విద్యార్థులు సెల్‌ఫోన్‌కు బానిసలు కాకుండా చెస్ ఆట ద్వారా ఏకాగ్రత, మానసిక అభివృద్ధి, విశ్లేషణాత్మక ఆలోచనా శక్తి పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. చెస్ ఆట కేవలం గెలుపు-ఓటమి కాదు, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని, ప్రణాళికా నైపుణ్యాన్ని నేర్పుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, గ్రామీణ యువత–యువకులు చెస్ ద్వారా మానసిక దృఢత్వం సాధించేలా ఇకపై మరిన్ని చెస్ బోర్డులు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.*చెస్ నెట్వర్క్ ఫౌండేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు*చెస్ నెట్వర్క్ ఫౌండేషన్ ఫౌండర్ సుధీర్ కోదాటి, రవి మయిరెడ్డి మరియు సంస్థ సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చి సహకారం అందించినందుకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనూ కోరుట్ల నియోజకవర్గంలో చెస్ పోటీలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించిన ఈ సంస్థ ఇప్పుడు ఉచిత బోర్డుల పంపిణీతో మరింత బలం చేకూర్చిందని ఆయన అన్నారు.*కోరుట్ల నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు* కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇలాంటి వినూత్న కార్యక్రమాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హామీ ఇచ్చారు. గత కొంతకాలంగా ఆయన ఆధ్వర్యంలో అథ్లెటిక్స్, క్రికెట్, కబడ్డీ వంటి క్రీడలతో పాటు చెస్ క్రీడకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కోరుట్లలో చెస్ క్రీడను గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు ఈ చొరవ మరింత ఊతమిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.______





