నేటి సాక్షి – కోరుట్ల*(రాధారపు నర్సయ్య)కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో ఆర్టీసీ బస్సును అడ్డగించి సిబ్బందిపై దాడి చేయడంతో పాటు మహిళా ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. డ్రైవర్–కండక్టర్ లిద్దరూ ధైర్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కండక్టర్ ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.*బస్సుకు అడ్డంగా మోటార్ సైకిల్ – గొడవకు నాంది.!*కోరుట్ల నుంచి యూసుఫ్ నగర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అయిలాపూర్ గ్రామానికి చేరుకోగా, అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తమ మోటార్ సైకిల్‌ను బస్సుకు అడ్డంగా పెట్టి నిలిపివేశారు. బస్సు డ్రైవర్ వాహనాన్ని పక్కకు జరపాలని సూచించగా, ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న యువకులు కొద్దిసేపటి తర్వాత బస్సులోకి ఎక్కి గొడవకు దిగారు.*బస్సు డ్రైవర్‌పై దాడి – విధులకు ఆటంకం.!*అయిలాపూర్ కు చెందిన లింగంపల్లి రాహుల్, నల్ల రక్షక్, మారంపల్లి వినయ్ అనే యువకులు బస్సులోకి వెళ్లి డ్రైవర్‌పై చేతులతో దాడి చేసి, బూతులు తిట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో డ్రైవర్, కండక్టర్ విధులకు ఆటంకం కలిగింది. ఫిర్యాదుదారుడు ఎర్రోళ్ల వేణుగోపాల్ (53), రేకుర్తి గ్రామం, కరీంనగర్ జిల్లా నివాసి. ఆయన ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. డ్రైవర్‌గా భూపాల వంశీకృష్ణ పనిచేస్తున్నారు.*మహిళలపై దురుసు ప్రవర్తన – ప్రయాణికులపై దాడి.!*ఇదే సమయంలో, అయిలాపూర్ నుంచి వస్తున్న బస్సును మధ్యలో కొంతమంది అల్లరిమూకలు ఆపి బస్సులోకి ఎక్కి మహిళలు, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. మాటలతో వేధింపులకు పాల్పడటంతో పాటు కొంతమంది ప్రయాణికులపై దాడి చేసారు. అల్లరిమూకల అల్లరితో బస్సులో భయాందోళనలు నెలకొన్నాయి.*ధైర్యంగా ఎదుర్కొన్న డ్రైవర్–కండక్టర్.!*బస్సులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని గమనించిన డ్రైవర్, కండక్టర్ ధైర్యంగా స్పందించి అల్లరిమూకలను అడ్డుకుని బస్సు నుంచి దించివేశారు. ప్రయాణికుల భద్రతను కాపాడుతూ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వారి బాధ్యతాయుత వ్యవహారాన్ని ప్రయాణికులు ప్రశంసించారు.ఈ ఘటనపై కండక్టర్ ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసినట్లు కోరుట్ల ఎస్సై చిరంజీవి తెలిపారు. మహిళలపై దాడులు, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు._____

