నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పనితీరును సవివరంగా పరిశీలించారు.*రికార్డుల పరిశీలన* కేసు డైరీలు, జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్, అరెస్ట్ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్, మాల్మత్తా రికార్డులు తదితర అన్ని రికార్డుల నిర్వహణను పరిశీలించి లోపాలు ఉన్న చోట్ల వెంటనే సరిదిద్దాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన విచారణ పూర్తి చేసి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి గ్రామాలు, కాలనీలలో తరచూ పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సిబ్బంది పూర్తి స్థాయి సిద్ధతతో ఉండి, సమస్యాత్మక వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని, అవసరమైతే బౌండోవర్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఫ్లాగ్‌మార్చ్‌లు, సమావేశాలపై నిఘా, మద్యం, డబ్బు పంపిణీ లాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.*సంక్రాంతి భద్రత, సైబర్ అవగాహన – ట్రాఫిక్ నియంత్రణపై సూచనలు*సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రజలు స్వగ్రామాలకు వెళ్లి ఇళ్లు ఖాళీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నందున దొంగతనాలను అరికట్టేందుకు రాత్రి–పగలు పెట్రోలింగ్ బలపరచాలని ఎస్పీ ఆదేశించారు. పట్టణంలోని ప్రధాన వీధులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాలు, బస్‌స్టాండ్‌ల వద్ద పోలీసింగ్‌ను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలని, ముఖ్యంగా యువతకు సైబర్ మోసాలు, ఆన్‌లైన్ లోన్స్, ఫేక్ లింకులు, OTP మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడకం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై చైతన్యం కల్పించాలని చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలతో పాటు ఎడ్యుకేషనల్ డ్రైవ్‌లు కూడా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ సురేష్, మెట్‌పల్లి సీఐ అనిల్‌కుమార్, ఎస్‌ఐ చిరంజీవి తదితర పోలీసులు పాల్గొన్నారు.________

