నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పురపాలక సంఘంలో వాహనాల వినియోగం, ఇంధన ఖర్చులు, బిల్లుల విధానంపై పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వాలని కటుకం.చంద్రశేఖర్ అనే ఔత్సాహికుడు బుధవారం ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా అధికారులను కోరారు. సమాచార హక్కు చట్టం–2005 ప్రకారం సమర్పించిన ఈ విన్నపం మున్సిపాల్టీ వ్యవహారాలపై కొత్త చర్చకు తావిస్తోంది.*వాహనాల సంఖ్య… ఇంధన వాడకంపై లెక్కలు చెప్పాలంటూ..*దరఖాస్తుదారు కటుకం చంద్రశేఖర్, 2025 జూన్ 27 నుంచి మున్సిపల్ కమీషనర్ గా రవిందర్ బాధ్యతలు చేపట్టిన నాటినుండి తాము అడిగిన వివరాలు కావాలని విన్నవించుకున్నారు.మున్సిపాల్టీ వద్ద ప్రస్తుతం ఎన్ని వాహనాలు ఉన్నాయో, వాటి వినియోగానికి 2025 జూన్ 27 నుంచి ఇప్పటివరకు ఎంత పెట్రోలు, డీజిల్ వాడారో పూర్తి లెక్కలతో వెల్లడించాలని అభ్యర్థించారు. ప్రతి వాహనానికి జరిగిన మరమ్మత్తుల వివరాలు, ఖర్చుల రికార్డులను కూడా అందించాలని చెప్పారు.*మాన్యువల్ బిల్లులపై సందేహం… వివరణ కోరుతూ..*ఇంధన కొనుగోలుకు కంప్యూటర్ బిల్లులు అందుబాటులో ఉన్నప్పటికీ, మున్సిపాల్టీ ఎందుకు మాన్యువల్ బిల్లులనే తీసుకుంటుందో స్పష్టత ఇవ్వాలని దరఖాస్తులో ప్రశ్నించారు. దీనిపై మున్సిపల్ అధికారులు ఏ ప్రక్రియను అనుసరిస్తున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.*ట్రాక్టర్లు, ఆటోలు, స్వీపింగ్ మెషిన్ల లెక్కలు తెలియాలి.!*పురపాలక సంఘం వద్ద ఉన్న ట్రాక్టర్లు, ఆటోలు, స్వీపింగ్ మెషిన్లు ఎన్ని ఉన్నాయో స్పష్టమైన లెక్కలు ఇవ్వాలని ఆయన కోరారు. పట్టణ శుభ్రత, చెత్త నిర్వహణలో కీలకమైన ఈ వాహనాల లభ్యతపై వివరాలు తెలియకపోవడంతో పౌరుల్లో సందేహాలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు.ఈ ఆర్‌టీఐకి సంబంధించిన సమాధానాలను పారదర్శకంగా ప్రకటించాలని చంద్రశేఖర్ కోరారు._____





