నేటి సాక్షి క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలు అలవాటు అవు తాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో కొనసాగుతున్న సి. ఎం. కప్ 2025 పోటీలకు జిల్లా యువజన క్రీడా సేవల అధికారి గుర్రాల హనుమంత రెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి అధికారులు, క్రీడాకారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుండి యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యతను వెలికి తీసేందుకు ప్రభుత్వం సి ఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని, క్రీడలతో ప్రశాంతత అలవాటు అవుతుందని తెలిపారు. నాయకత్వ లక్షణాలతో టీం వర్క్ ప్రాధాన్యత తెలుస్తుందని, కలిసి పని చేయడంతో ఏదైనా సాధించవచ్చు తెలిపారు. క్రీడలలో గెలుపు, ఓటములు సామాన్యమని, క్రీడా స్ఫూర్తితో ఆటలలో పాల్గొనాలని తెలిపారు. ఒకసారి ప్రయత్నించి రాలేదు అని నిరుత్సాహపడకుండా సాధించే వరకు ఫలితం ఆశించకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని తెలిపారు. సి.ఎం. పోటీలలో భాగంగా గ్రామీణ, మండల, నియోజకవర్గస్థాయి స్థాయి పోటీలను పూర్తి చేసుకుని జిల్లా స్థాయి పోటీలను నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి ఆటల పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల నుండి దాదాపు 400 మంది క్రీడాకారులు హాజరయ్యారని, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, జిమ్నాస్టిక్స్, రూలర్ స్కేటింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, సైక్లింగ్ క్రీడాంశాలలో పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సమయంలో సిబ్బంది సహకారం తక్కువగా ఉన్నప్పటికీ జిల్లాలో క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఒలంపిక్స్ లో తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడల కోటాలో ఉద్యోగ అవకాశాలు కూడా సాధించవచ్చు అని, క్రీడాకారులు ఏకాగ్రతతో శిక్షణ పొంది క్రీడలలో రాణించాలని తెలిపారు.ఈ,కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వివిధ క్రీడ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

