నేటిసాక్షి, కరీంనగర్ టౌన్:కొత్తపల్లి ఖబ్రస్తాన్‌కు ప్రహరీ నిర్మించాలని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ మంగళవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అజీమ్ మాట్లాడుతూ కొత్తపల్లిలోని నాలుగు ఎకరాల్లో ఉన్న దర్గా హజ్రత్ సయీద్ అహ్మద్‌షా వలీ రహ్మతుల్లా అలయ్, దర్గా హజ్రత్ సయీద్ హబీబ్‌షా వలీ రహ్మతుల్లా అలయ్ వద్ద ప్రహరీ లేకపోవడంతో అన్యాక్రాంతం అయ్యే ప్రమాదముందన్నారు. చుట్టూ గోడ లేకపోవడంతో పశువులు సంచరించడం, చెత్త పడేస్తుండడంతో తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు. ఖబ్రస్తాన్ అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు, శుభ్రంగా ఉంచేందుకు ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరుచేయాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.





