-వైభవంగా బోనాల ఊరేగింపు..
నేటి సాక్షి, దేవరకద్ర జూలై 1
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని దేవరకద్ర మండలం గద్దె గూడెంలో మంగళవారం గ్రామదేవత పోచమ్మ దేవత బోనాల వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది గ్రామంలో అమ్మవారి బోనాల వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈ పవిత్ర కార్యక్రమాన్ని గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన బోనం కుండలను తలపై పెట్టుకుని మహిళలు పెద్ద ఎత్తున ఊరేగింపుగా పోచమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. తప్పెట్లు, శివశక్తుల పూనకాల మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది. అనంతరం బోనం కుండలతో గుడి చుట్టూ మహిళలు ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ రీతిలో అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. బోనాల వేడుక సందర్భంగా అమ్మవారి గుడిని రంగురంగుల విద్యుత్ బల్బులు, మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.