నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి నగరంలోని గరుడవారధి పై వేగ నియంత్రణకు మరిన్ని అదనపు చర్యలు చేపట్టాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. గరుడవారధి పై వాహనాల వేగ నియంత్రణ కొరకు స్మార్ట్ సిటీ, పోలీస్, ఇంజనీరింగ్ అధికారులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ గరుడవారధి పై ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే ఏర్పాటు చేశామని తెలిపారు. వాహన చోదకుల్లో మరింత అవగాహన కలిగించేలా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా వేగాన్ని నియంత్రించే రబ్బర్ స్ట్రిప్స్, మలుపు తెలుపుతూ సూచిక బోర్డులు, బ్లింకర్స్, స్పీడ్ లిమిట్ బోర్డులు మరిన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే గరుడవారధి పైన, కింద ట్రాఫిక్ నియంత్రణ కొరకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ రవిమనోహర్ ఆచారి, డి.ఎస్.పి. లు రామకృష్ణ ఆచారి, భక్తవత్సలం, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, ఈ.ఈ. రవి, ఆఫ్కాన్స్ ప్రతినిధి రంగస్వామి, తదితరులు పాల్గొన్నారు.





