నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 08 ~అన్నమయ్య జిల్లా :-: స్థలపురాణంతో పనిలేదని ఇప్పటికే పలుమార్లు రుజువయింది. కొందరు వ్యక్తులు జనాల సొమ్మే కాదు. దేవుడి సొత్తును సైతం వదిలిపెట్టడం లేదు. ఆలయంలో పని చేస్తూ ఆ దేవుడికే శఠగోపం పెడుతున్నారు. ఇలాంటి ఘటన సర్వ సాధారణంగా ఉన్నా తాజా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆలయ ఈవో చేతివాటాన్ని జనాలు తిప్పి కొట్టారు. తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండల కేంద్రమైన యర్రదొడ్డిలో జరిగింది. స్థానిక గంగమ్మ ఆలయంలో అమ్మ వారికి అక్కడ జనం వెండి ఆభరణాలు అలంకరించి ప్రతి నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఆభరణలాలపై ఈవో మురళీకృష్ణ కన్ను పడింది. ఆదివారం కావడంతో తన భార్యతో కలిసి చేతి వాటాన్ని ప్రదర్శించాడు. తన సతీమణికి ఆలయ దర్శనం చేయించుకురమ్మని అసిస్టెంట్‌ను బయటకు పంపాడు. ఇదే సమయంలో కార్యాలయం బీరువాలో ఉన్న వెండి నగలు, విలువైన చీరలు, కొంత బంగారాన్ని టేబుల్‌పై పెట్టి మూటలు కట్టేశాడు. ఈ తతంగమంతా వీడియోల్లో రికార్డు అయ్యింది. ముందే పథకం ప్రకారం సిద్ధం చేసుకున్న ఆటో డ్రైవర్‌ను కార్యాలయంలోకి పిలిపించి, కట్టిన మూటలను ఆటోలో పెట్టించడంతో మొత్తం తంతు పూర్తయింది. ఇంతలోనే గడిబిడిగా ఈవో భార్య రావడం ఆటోలో వెళ్లి కూర్చోవడంతో స్థానికులకు అనుమానమొచ్చింది. దీంతో స్థానికులు ఆటోను అడ్డుకున్నారు. ఈవోను పట్టుకుని గట్టిగా నిలదీశారు. మూటలో ఏముందో చూపాలంటూ స్థానికులు గట్టిగా వాదించారు. దీంతో ఈవో ఆయన భార్య ఇద్దరు నీళ్లు నమిలారు. కొందరు స్థానికులు మూటను విప్పి చూస్తే వెండి ఆభవరణాలు మరి కొన్ని వెండి వస్తువులు పట్టుబడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమంతా తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి, ఈవో మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అనుమతిలేకుండా ఆలయ ఆభరణాలు తరలించినందుకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు ఆలయ ఈవోను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ అనంతరం కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ఈయనపై చర్యలు తీసుకుంటుందో లేదో ఏం జరుగుతుందో చూడాలి. అయితే, 6.23 లక్షల రూపాయల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. 6 కేజీల వెండి, 2 గ్రాముల బంగారం, 15 చీరలు పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనతో ఆలయ పరిపాలన విధానంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆలయానికే కాకుండా ప్రసిద్ధి పొందిన పాలపాటిదిన్నె ఆంజనేయ స్వామి వారి ఆలయానికి సైతం ఈవోగా ఉన్నారని స్థానికులు అంటున్నారు. భక్తులు, స్థానికులు ఆలయ భద్రతా చర్యలపై పునర్విమర్శ అవసరమని డిమాండ్ చేస్తున్నారు..~~~~~~~~~~~~~~~~~~





