రినేటి సాక్షి గజ్వేల్ :—గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) నమోదు చేయించుకోవాలని గజ్వేల్ శేషమా ఇండియన్ గ్యాస్ నిర్వాహకులు నంబూరి రామలింగేశ్వరరావు సూచించారు. గురువారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు దేశవ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్లను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.గత కొన్ని నెలలుగా గ్యాస్ డీలర్లు మొబైల్ యాప్‌ల ద్వారా వినియోగదారుల వద్దకే వెళ్లి ఈ–కేవైసీ నమోదు చేస్తున్నారని తెలిపారు. కొంతమంది వినియోగదారులు సిలిండర్ సరఫరా సమయంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయించుకుంటున్నప్పటికీ, ఇంకా లక్ష్యానికి తగిన స్థాయిలో నమోదు జరగలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్యాస్ వినియోగదారుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు పూర్తి చేసుకోవాలని కోరారు.ఈ–కేవైసీ చేయించుకోని వినియోగదారులకు భవిష్యత్తులో సిలిండర్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఆధార్ కార్డు, మొబైల్ నంబర్‌తో సమీప గ్యాస్ ఏజెన్సీని లేదా డెలివరీ సిబ్బందిని సంప్రదించి వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.ఇక రీఫిల్ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కూడా మార్పులు చేసినట్లు తెలిపారు. గతంలో సిలిండర్ తీసుకున్న తర్వాత 20 రోజులకే కొత్త సిలిండర్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉండేదని, ఇకపై 25 రోజుల తర్వాత మాత్రమే రీఫిల్ బుకింగ్ చేయగలరని వివరించారు. వినియోగదారులు ఈ మార్పులను గమనించి ముందుగానే బుకింగ్ ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.అలాగే గ్యాస్ వినియోగంలో భద్రతా నియమాలు పాటించాలని, లీకేజీ అనుమానం వచ్చిన వెంటనే సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు. గజ్వేల్ పరిధిలో ఉన్న వినియోగదారులందరూ త్వరగా ఈ–కేవైసీ నమోదు పూర్తి చేసి ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని నంబూరి రామలింగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.





