నేటి సాక్షి, నల్లబెల్లి జనవరి 09 : నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ సపావట్ కవిత శుక్రవారం నర్సంపేట డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుమారు 2000 జనాభా ఉన్న తమ గ్రామం నుండి ప్రతిరోజూ చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు తమ అవసరాల నిమిత్తం పట్టణాలకు వెళ్తుంటారని తెలిపారు. గ్రామానికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా, సమయ పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు సకాలంలో వరంగల్ వంటి ప్రాంతాలకు చేరుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.తమ గ్రామం మీదుగానే చుట్టుపక్కల ఉన్న మాన్సింగ్ తండా, చంద్రు తండా, కోడిసెలకుంట తండా , గుర్తుర్ తండా ప్రజలు కూడా నర్సంపేటకు వెళ్లాల్సి ఉంటుందని, కావున అందరి సౌకర్యార్థం ఉదయం 7:00 గంటలకు, మధ్యాహ్నం 1:30 గంటలకు మరియు సాయంత్రం 5:00 గంటలకు మూడు ట్రిప్పుల చొప్పున బస్సు సర్వీసును నడపాలని ఆమె అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నెహ్రుజి,లంబాడి హక్కుల పోరాట సమితి నల్లబెల్లి మండల అధ్యక్షుడు దారావత్ బోజ్యా నాయక్,సపావట్ యాకన్న తదితరులు పాల్గొన్నారు.

