Thursday, March 12, 2026

గ్రామాల్లో కల్తీ కిరాణా సరుకుల దందా..!నూనెలు, పప్పులు, సబ్బులు తదితర వస్తువుల్లో నాసిరకం నాణ్యత…బ్రాండ్ పేర్లతో తక్కువ నాణ్యత సరుకులు అమ్ముతున్నారన్న ఆరోపణలు…

నేటి సాక్షి, మునగాల( పాముల రాఘవేందర్) మునగాల మండలంలోని పలు గ్రామాల్లో కిరాణం వ్యాపారస్తులు నిత్యావసర వస్తువుల పేరుతో నాసిరకం నాణ్యత గల సరుకులు విక్రయిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వంట నూనెలు, పప్పులు, సబ్బులు, ఇతర కిరాణా సరుకులను ప్రముఖ కంపెనీల పేర్లు చెబుతూ తక్కువ నాణ్యత గల వస్తువులు అమ్ముతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామాల్లో ఉన్న కొన్ని దుకాణాల్లో చవక ధరల పేరుతో నాణ్యత లేని సరుకులు విక్రయించడంతో ప్రజలు మోసపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. వంట నూనె ప్యాకెట్‌లపై స్పష్టమైన వివరాలు లేకుండా, నాణ్యత ప్రమాణాలు లేని వస్తువులు కూడా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రామ ప్రజలు తెలియకుండానే నాసిరకం సరుకులు కొనుగోలు చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు.ప్రత్యేకంగా వంట నూనెలు, పప్పులు వంటి ఆహార పదార్థాల్లో కల్తీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఇలాంటి నాసిరకం ఆహార పదార్థాలు వాడటం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో నిత్యావసర వస్తువుల విక్రయంపై సంబంధిత ఆహార భద్రత అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. నాణ్యత లేని వస్తువులు విక్రయిస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.అలాగే ప్రజలు కూడా సరుకులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్యాకెట్‌పై తయారీ తేదీ, గడువు తేదీ, నాణ్యత గుర్తులు వంటి వివరాలు పరిశీలించి మాత్రమే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. అనుమానాస్పదంగా కనిపించే వస్తువులను కొనకుండా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.గ్రామాల్లో నాసిరకం, కల్తీ సరుకుల విక్రయం కొనసాగితే ప్రజల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా నష్టం కలుగుతుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అధికారులు వెంటనే స్పందించి గ్రామాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి కల్తీ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News