నేటి సాక్షి గజ్వేల్ :— గజ్వేల్ మండల పరిధిలోని గ్రామాల సర్పంచులతో శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రవికుమార్ గ్రామాల అభివృద్ధి మరియు శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజా ప్రతినిధుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల గ్రామాల్లోకి వచ్చే అపరిచిత వ్యక్తుల కదలికలను గమనించడం సాధ్యమవుతుందని, నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడం సులభమవుతుందని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో యువత హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, అతి వేగంతో డ్రైవింగ్ చేయడం వంటి చర్యలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగే ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సర్పంచులకు సూచించారు.అలాగే గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పేకాట లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు గ్రామాలు వేదిక కాకుండా చూడాలని, అలాంటి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.





