నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 17 ~అన్నమయ్య జిల్లా :-: మాజీ సీఎం వైయస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా మొట్టమొదటైన గ్రామ, వార్డు సచివాలయాలు గత ప్రభుత్వ పాలనలో ఎంతో విశిష్టత తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలాంటి వ్యవస్థ పేరు మారుస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు వాటి పేర్లను ప్రకటిస్తూ ఇకపై ‘స్వర్ణగ్రామం’గా పిలవబడుతుందని సూచించారు. ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు మంత్రులు, జిల్లా కలెక్టర్లు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలు పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పరిపాలనా సంస్కరణలపై సీఎం చంద్రబాబు విస్తృతంగా మాట్లాడారు. కాగా శాఖలు, జిల్లాల వారీగా కలెక్టర్ల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేశారు. నిర్దేశిత గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల కాలంలో సుమారు 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించామని ఉగాది నాటికి మరో 5 లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించబోతున్నామని ప్రతి మూడు నెలలకు టార్గెట్ పెట్టుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. గతంలో ఊళ్లకు దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించారు. కొందరు లబ్ధిదారులు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. తిరుపతి లాంటి నగరాల్లో ఈ సమస్య ఉంది. లబ్దిదారులతో సంప్రదించి ఇతర ప్రాంతాల్లో వారికి స్థలాలు కేటాయించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వచ్చిన విమర్శలకు సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పీపీపీ పద్ధతిలోనే మెడికల్ కాలేజీలు..——————————————పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వచ్చిన విమర్శలకు సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ కళాశాలల పేరుతోనే కొనసాగుతాయని చెప్పారు. వాటికి సంబంధించిన నిబంధనలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ కాలేజీల్లో 100 శాతం అవుట్ పేషెంట్ సేవలు ఉచితంగా ఉంటాయని 70 శాతం మందికి ఎన్‌టీఆర్ వైద్య సేవలు అందుతాయని చెప్పారు. సీట్ల సంఖ్య కూడా పెరిగిందని వెల్లడించారు. విమర్శలు చేసే వారు వాస్తవాలు తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు హితవు పలికారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృథా చేశారని విమర్శించారు. ఆ నిధులు ఉంటే ఇప్పటికే రెండు మెడికల్ కాలేజీలు నిర్మించి ఉండేవాళ్లమని వ్యాఖ్యానించారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో సాధిస్తున్న త్రైమాసిక ఫలితాలను విద్యార్థి పరీక్ష ఫలితాలు లాగా ఎదురు చూస్తానని అన్నారు. అధికారులంతా లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవాలని సూచించారు. గత రెండు త్రైమాసికాల్లో మంచి ఫలితాలు సాధించామని, ఈసారి వృద్ధి లక్ష్యాన్ని 17.11 శాతంగా పెట్టుకున్నామని తెలిపారు. మొత్తం 17 వర్టికల్స్‌లో ఫలితాలు సాధిస్తేనే జీఎస్డీపీ పెరుగుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా వెనుకబడిన ప్రాంతాలకు చేయూత ఇస్తున్నామని తెలిపారు. ప్రతి యూనిట్, ప్రతి శాఖలో సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి ప్రగతిలో, అధికారుల పనితీరులో క్వాంటమ్ ఇంప్రూవ్‌మెంట్ కనిపించాలన్నది తన ఆశయమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.~~~~~~~~~~~~~~~~~~





