Monday, December 23, 2024

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతం

  • కలెక్టర్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు
  • మొత్తం 18663 మందికి 14577 మంది అభ్యర్థులు హాజరు
  • స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్

నేటి సాక్షి, కరీంనగర్​: కరీంనగర్ జిల్లాలో ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నోడల్ ఆఫీసర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి, జ్యోతిష్మతి, తిమ్మాపూర్ లోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలల్లో, కరీంనగర్​లోని వాణినికేతన్ డిగ్రీ, పీజీ కళాశాల, పారమిత స్కూల్​లో జరిగిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పరిశీలించారు. పరీక్షకు సంబంధించిన వివరాలు, సౌకర్యాల కల్పనపై అధికారులను నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులంతా టీజీపీఎస్సీ రూపొందించిన నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. అభ్యర్థుల ఫోటో వెరిఫికేషన్ సరిగా చేయాలని, హాల్ టికెట్​పై ఫొటోలు సరిగా లేని వారి నుంచి మూడు పాస్ ఫొటోలు తీసుకోవాలని పేర్కొన్నారు. 10 గంటల తర్వాత గేట్లు మూసివేయాలని, ఆలస్యంగా వచ్చిన వారిని ఎట్టి పరిస్థితిలో అనుమతించ వద్దని సూచించారు. ఎగ్జామ్ హాల్​కు నిర్ణయించిన సమయంలోగా ఓఎంఆర్, ప్రశ్నపత్రాలను పంపించాలని తెలిపారు. దివ్యాంగుల కోసం పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. స్క్రైబ్​ల సహాయం కోరే వారికి సహకరించాలని వారికి అదనపు సమయం కేటాయించాలని పేర్కొన్నారు. పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు నిరంతరం పర్యవేక్షించేందుకు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు ఏర్పాటు చేశామని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా సజావుగా సాగిందని పేర్కొన్నారు. బయోమెట్రిక్, సెంటర్ల వారీగా కేటాయించిన సిబ్బంది హాజరు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 36 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 36 మంది అబ్జర్వర్లు, ఏడుగురు రూట్ ఆఫీసర్లు, ఏడుగురు ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 208 ఐడెంటిఫికేషన్ అధికారులను నియమించినట్లు అదనపు కలెక్టర్ వెల్లడించారు. 18663 మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 14577 మంది హాజరు కాగా, 4086 మంది గైర్హాజరైనట్లుగా పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఆదివారం ఉదయం కరీంనగర్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్ లోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచిన ఓఎంఆర్ సీట్లు, ప్రశ్నాపత్రాలు ఇతర సామాగ్రిని ఆయా పరీక్ష కేంద్రాలకు తగిన పోలీస్ భద్రత మధ్య తరలించామని తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా సాగేలా సహకరించిన అధికారులు సిబ్బంది పోలీసు అధికారులకు అదనపు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News