నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతిః గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోకి మరో పది పంచాయితీల విలీనానికి మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో గ్రేటర్ సిటీగా తిరుపతిని నిలపడమే నిదర్శనమని ఆయన చెప్పారు. గత నెల 24వ తేది గ్రేటర్ కార్పోరేషన్ లో 53 పంచాయితీలను విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ సమయంలోనే మరికొన్ని పంచాయితీలను కలిపే అవకాశం ఉంది పదిహేను రోజులు గడువు కావాలని చెబితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేసిందని ఆయన విమర్శించారు. చంద్రగిరి, శ్రీకాళహస్తికి చెందిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలతో చర్చించి కొత్తగా పది పంచాయితీలను విలీనం చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా విలీనానికి ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. తిరుపతి శరవేగంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నాయని ఆయన తెలిపారు. తిరుపతిని మహానగరంగా అభివృద్ధి పరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోది సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనాయకులు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ లు కృతనిశ్చయంతో ఉన్నారని ఆయన చెప్పారు. మేయర్ డాక్టర్ శిరీషా మరి కొన్ని ప్రాంతాలను గ్రేటర్ లో కలపాలని సూచించారని ఆ సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మేయర్ సూచనలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు తలోమాట మాట్లాడేందుకు ప్రయత్నించటాన్ని ఆయన తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఒక్కర కోసమో కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ తరువాత తిరుపతిని అభివృద్ధిలో నిలిపేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఆయన తెలిపారు. 1886లో మున్సిపల్ గా ఏర్పడిన తిరుపతి కాలక్రమంలో గ్రేటర్ గా విస్తరిస్తోందని ఆయన చెప్పారు. గ్రేటర్ కార్పోరేషన్ గా తిరుపతి రూపుదిద్దుకోవడంలో కార్పోరేటర్లు, డిప్యూటీ మేయర్లు, కమిషనర్, తాను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.





