నేటి సాక్షి తిరుపతి *తిరుపతి రూరల్* తిరుమల తరహాలో తుమ్మలగుంట లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి వారి పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం కనుమ పండుగను పురస్కరించుకొని శ్రీ కళ్యాణ వెంకన్న పశు పక్షాదుల సంరక్షణ నిమిత్తం సాంప్రదాయ బద్దంగా నిర్వహించిన పార్వేట ఉత్సవం ఎంతో వేడుకగా సాగింది. తుమ్మలగుంట ఆలయం నుంచి శ్రీ కళ్యాణ వెంకన్న పంచ ఆయుధాలతో ఊరేగింపుగా బయలుదేరి నలందానగర్‌లోని పార్వేటమండపానికి చేరుకున్నారు. అక్కడ కళ్యాణ వెంకన్నను అర్చకస్వాములు వేంచేపు చేశారు. అనంతరం ఆరాధనం, నివేదన, హారతులు పట్టారు. వేదం, గోవిందుని సంకీర్తనలు ఆలపించి పార్వేటను నిర్వహించారు. శ్రీ కళ్యాణ వెంకన్న స్వామి వారి తరపున అర్చకులు కొంత దూరం పరుగెత్తి బాణం వేసి వెనుకకు విచ్చేశారు. అంతకు ముందు ఆలయం వద్ద కళ్యాణ వెంకన్నకు హారతి పట్టిన తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పల్లకీని పార్వేట మండపం వరకు మోశారు. పార్వేట ఉత్సవానికి బయలుదేరిన కళ్యాణ వెంకన్నకు భక్తులు అడుగడుగునా కర్పూర హారతలు పట్టారు. ఈ ఉత్సవంలో చెవిరెడ్డి రఘునాథరెడ్డి దంపతులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.*గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు* కనుమ పండుగను పురస్కరించుకొని తుమ్మలగుంట గ్రామంలోని గ్రామ దేవతలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. గ్రామస్తులు అందరితో కలసి గ్రామ శివార్లలోని చిట్లా కుప్పకు నిప్పు పెట్టే కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. పశుసంపదతో పాటు పాడి పంటలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పల్లె సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించి అనుసరించాలని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

