భక్తులతో నిండిన బెజ్జంకి క్షేత్రం
నేటి సాక్షి, బెజ్జంకి:సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీలక్ష్మీసమేత నృసింహ స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం ఆశేష జనవహిని మధ్య మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు హాజరై స్వామి వారి దివ్య కళ్యాణ దర్శనం చేసుకున్నారు. స్వామి మరియు అమ్మవార్లను సంప్రదాయబద్ధంగా అలంకరించి, పూజారుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణం నిర్వహించబడింది.ఉదయం నుంచి ఆలయం ప్రాంగణంలో భక్తుల రద్దీ కొనసాగింది. తిరుకళ్యాణానికి ముందుగా విభిన్న రకాల పూజలు, సుదర్శన హోమం, కల్యాణ మహోత్సవ పూజలు నిర్వహించబడ్డాయి. నృత్యాలు, హారతులు, సంగీత కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో ఆలయం మారుమోగింది.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరు కళ్యాణాన్ని గ్రామస్థుల, వివిధ రాజకీయ పార్టీ ల నాయకుల సహకారంతో వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనందకరం అన్నారు.మానకొండూరు శాసన సభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో కోటి రూపాయలతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేశామని తెలిపారు.బ్రహ్మోత్సవాలలో భాగంగా తేది: 12-04-2025 శనివారము రోజున సాయంత్రం 04:00 గంటలకు శకటోత్సవము (గుట్ట చుట్టూ బండ్లు తిరుగుట),తేది: 13-04-2025 ఆదివారము రోజున రాత్రి గం| 03:50 ని॥లకు (తెల్లవారితే సోమవారము) స్వామి వారి దివ్య రథోత్సవము (ముఖ్యమైన జాతర)జరగనున్నాయని, ఇట్టి బ్రహ్మోత్సవాలకు కరీంనగర్ ఉమ్మడి మెదక్, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ప్రతి సంవత్సరం వస్తారు. కాబట్టి భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించామని తెలియజేశారు. కరీంనగర్ సిద్దిపేట హుస్నాబాద్ హనుమకొండ సిరిసిల్ల నుండి బస్సుల సౌకర్యం కల్పించామని, నీటి వసతి చలువ పందిళ్ళు భక్తుల సౌకర్యార్థం కల్పించామన్నారు.అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి జాతరను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.కళ్యాణ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

