–వందలాదిగా తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు
–క్లాక్‌టవర్ నుంచి తహశీల్దారు కార్యాలయం వరకు భారీ ర్యాలీ
–ఓట్లు వేసిన ప్రజలకు వెన్నుపోట్లు పొడిచారంటూ మండిపాటు
– కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగట్టిన మోహిత్ రెడ్డి
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చంద్రగిరి నియోజకవర్గం కేంద్రంలో ఆ పార్టీ సమన్వకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. బుధవారం ఉదయం 10.30గంటలకు క్లాక్‌టవర్ వద్ద ప్రారంభమైన ర్యాలీ 12గంటలకు తహశీల్దారు కార్యాలయం వద్దకు చేరుకుంది. వెన్నుపోటు దినం నిసనకు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో వీధులన్నీ వైఎస్‌ఆర్‌సీపీ జెండాలు పట్టుకున్న కార్యకర్తలతో నిండి పోయాయి. జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
గత ఏడాది ఎన్నికలకు ముందు అబద్ధపు మాటలతో అడ్డగోలుగా ప్రచారం చేసి సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది గడిచినా ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విమర్శించారు. బూటకపు మేనిఫెస్టోను తెచ్చి అధికారంలోకి వచ్చాక దానిని అమలు చేయడానికి ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ కబుర్లు చెప్పి మేనిఫెస్టోను మూల పడేశారన్నారు. ముఖ్యంగా మహిళా శక్తి పేరుతో ఆడపడుచులకు ఇచ్చిన హామీలను తల్లికి వందనం, ఆడబిడ్డ నీది, ఉచితబస్సు వంటి పథకాలను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఆ అక్క చెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచి తాను అధికారాన్ని అనుభవిస్తున్నారన్నారు. అలాగే చదువుకుంటున్న పిల్లలను మభ్యపెడుతూ ఎన్నికల సమయంలో నీకు 15వేలు.. నీకు 15వేలు.. మరి నీకు 18వేలు.. అంటూ మైకులు పగిలేలా ప్రచారం చేసిన కూటమి నేతలు ఆయా వర్గాల వారికి వెన్నుపోటు పొడిచారన్నారు.. ఉచిత గ్యాస్ సిలిండర్ అంటూ మధ్యతరగతి మహిళలను మోసం చేసి సిలిండర్ కొన్నాక డబ్బులు వేయకుండా వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రభుత్వమే తప్పు చేసినా, సామాన్య ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ సామాన్యులకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండానే విజయోత్సవ సంబరాలు చేసుకోవడం చూస్తుంటే పవన్ కల్యాణ్ మాటలకు, చేతలకు పొంతనలేకుందన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు, కేసులు అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రగిరిలో ఇసుక, మట్టి, లిక్కర్, భూ మాఫియాలు బరితెగించినా, స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని వారితో చేతులు కలిపి సహజవనరులను దోపిడీచేస్తున్నారని ఆరోపించారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా నాని ఏడాది పాలనలో అవినీతి, అక్రమాలు, ఆక్రమణలు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వసాలతో సాగిందని, సామాన్య ప్రజలకు కన్నీళ్లు, కష్టాలు తప్ప ఏటువంటి మేలు జరగలేదన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు వెన్నుపోట్లు పొడవటం తప్ప ఏమీ చేయలేదని మండిపడ్డారు.
పండుగలు వస్తున్నాయ్ సరే.. ఉచిత బస్సు ఏదీ…?
మహిళలకు ఉచిత బస్సు కల్పిస్తానని మాట చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తలేదు. ఉగాది నుంచి ఉచిత బస్సుల అమలు చేస్తామని ఓ మంత్రి చెబుతాడు.. ఆ పండుగ అవగానే మరో మంత్రి మీడియా ముందుకు వచ్చి దీపావళి నుంచి వస్తుందంటారు.. ఆ పండుగ పోతుంది.. ఆ తరువాత మరొకరు వచ్చి సంక్రాంతికి తప్పకుండా అమలు చేస్తామని చెబుతారు.. ఆపండుగా పోయింది.. ఇలా పండుగలు వస్తున్నాయ్.. పోతున్నాయ్.. మరి మహిళలకు ఉచిత బస్సు ఇప్పటికీ రాలేదు.. అని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి చమత్కారంతో విమర్శలు చేయడం పార్టీ నేతలు, కార్యకర్తలు అందరినీ ఆకట్టుకోగా ప్రజలను ఆలోచింప చేసింది. చివరగా చంద్రగిరి తహశీల్దారు శివరామసుబ్బయ్యకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల నుంచి వచ్చిన పార్టీ సీనియర్లు, ప్రజాప్రతినిధులు, అనుబంద విభాగాల కమిటీ నేతలు, పంచాయతీ పార్టీ నాయకులు, జగనన్న అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

