నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
చంద్రగిరి పట్టణ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ దేవర మనోహర్ ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులు, ముఖ్య నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవర మనోహర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీ శక్తిని పెంపొందించడానికి, స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి మనందరం కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని జనసైనికులకు హితబోధ చేశారు.
చురుకైన జనసైనికుల నియామకం
గ్రామాల్లో పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయడమే లక్ష్యంగా, ప్రతి గ్రామానికి ముగ్గురు చురుకైన, నిబద్ధత గల జనసైనికులను ఎంపిక చేసి కేంద్ర కార్యాలయం తరఫున నియమించడం జరిగింది. గ్రామంలోని సమస్యలు, ప్రజల అభిప్రాయాలు పార్టీకి చేరవేసే బాటలో వీరు కీలక పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు.
పార్టీ సంస్థాగతంగా అభివృద్ధి
జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలంగా తీర్చిదిద్దడం మన ముందున్న బాధ్యతని అన్నారు. ప్రతి బూత్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని, కార్యకర్తలకు శిక్షణా శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, యువతలో చైతన్యం కలిగించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ విధివిధానాలు గ్రామ ప్రజలకు చేరేలా ప్రచారం చేయాలని తెలిపారు.
లోకల్ బాడీ ఎలక్షన్లపై అవగాహన
స్థానిక సంస్థల ఎన్నికలు మన పార్టీకి ఒక పరీక్షాసమయం. ప్రతి వార్డు, మండల స్థాయిలో ఎన్నికల సంసిద్ధతపై అవగాహన కల్పించాలి.
ఈ ఎన్నికలు ప్రజలకు ప్రత్యక్షంగా సేవచేసే అవకాశాన్ని ఇస్తాయి. అందువల్ల అభ్యర్థులు ప్రజల మద్దతును పొందేందుకు శక్తివంచన లేకుండా పని చేయాలి. ఓటింగ్ శాతం పెంచేందుకు డోర్ టు డోర్ క్యాంపెయిన్లు, యువతలో చైతన్యం, సోషల్ మీడియా వినియోగం పెంచాలని దిశా నిర్దేశం చేశారు.
మన లక్ష్యం కేవలం ఓటు అడగడం కాదు – గ్రామ అభివృద్ధి, ప్రజల గళంగా నిలవడమే. ఈరోజు తీసుకున్న ప్రతి నిర్ణయం, మనం వేసే ప్రతి అడుగు ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి. మన చంద్రగిరిని – జనసేన విజయగాధలతో నిలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని జనసైనికులలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ కార్యక్రమంలో 7 మండలాల అధ్యక్షులు,ఇంచార్జ్ లు ,నియోజక వర్గ ముఖ్య నాయకులు ,జనసైనికులు పాల్గొన్నారు.