నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధిచట్ట పరిధిలో విచారించి నిర్దిష్ట గడువులోగా అర్జీలు పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ అర్జీదారులకు భరోసా కల్పించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన 62 మంది అర్జీదారులు కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలు, ఇతర పలు సమస్యలను జిల్లా ఎస్పీ గారికి విన్నవించుకున్నారు. ఎస్పీ ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. వెంటనే సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి అర్జీలను చట్ట పరిధిలో వేగవంతంగా విచారించి, నిర్ణిత గడువులోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చెయ్యాలని ఆదేశించారు. అర్జీ దారుల సమస్యను పరిష్కరించడానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని పోలీస్ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ డిఎస్పి పి.జగదీష్ నాయక్ , పి.జి.ఆర్.ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ యు.శ్రీనివాసరావు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




