నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, అక్టోబర్ 14: చిత్తూరులోని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఏఐఎంఎస్‌ఆర్) మంగళవారం ఆసక్తికరమైన క్లినికల్ మీటింగ్ నిర్వహించింది. పిల్లల వైద్య విభాగం, మానసిక వైద్య విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో వైద్య విద్యార్థులు, పీజీ విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.పిల్లల వైద్య విభాగం పీజీ విద్యార్థి డా. ఆర్. కృష్ణ కిశోర్ రెడ్డి “డెంగ్యూ జ్వరాన్ని గుర్తించే చర్మ సంకేతాలు” అనే అంశంపై ప్రసంగించారు. డెంగ్యూ జ్వరంలో చర్మంపై కనిపించే ప్రత్యేక దద్దుర్లు, వాటి ఆధారంగా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించే మార్గాలను ఆయన వివరించారు. ఈ సమావేశానికి పిల్లల వైద్య విభాగం ప్రొఫెసర్ డా. వి. రాజేష్ కుమార్ మోడరేటర్‌గా వ్యవహరించారు. వైద్య విద్యార్థుల్లో వ్యాధుల నిర్ధారణ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఇలాంటి చర్చలు ఎంతో దోహదం చేస్తాయని ఫ్యాకల్టీ సభ్యులు అభిప్రాయపడ్డారు. మానసిక వైద్య విభాగం పీజీ విద్యార్థిని డా. జి. సాయి మనసా స్కిజోఫ్రెనియా రోగుల చికిత్సలో తలెత్తే టార్డివ్ డిస్కైనీషియా అనే కదలికల నియంత్రణ లోపం సమస్యను తగ్గించే సమర్థ వైద్యం — మానసిక శాంతి, శారీరక నియంత్రణ అనే అంశంపై కేస్‌స్టడీ ప్రదర్శన చేశారు.స్కిజోఫ్రెనియా చికిత్సలో ఉపయోగించే ఔషధాల వల్ల వచ్చే దుష్ప్రభావాలను, వాటిని ముందస్తుగా గుర్తించి సమర్థంగా నియంత్రించడం ద్వారా రోగి జీవిత నాణ్యతను మెరుగుపరిచే మార్గాలను వివరించారు. ఈ సెషన్‌కు మానసిక వైద్య విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. టి. జయప్రియా, డాక్టర్ దినేష్ మోడరేటర్లుగా వ్యవహరించారు. ఫ్యాకల్టీ సభ్యులు,విద్యార్థులు ఈ చర్చను ఆసక్తితో పరిశీలించి, క్లినికల్ అవగాహనను పెంపొందించుకున్నారు.ఈ సమావేశానికి పిల్లల వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సి.మురళి, మానసిక వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పి.దినేష్ చైర్‌పర్సన్స్‌గా వ్యవహరించారు. కార్యక్రమంలో ఏఐఎంఎస్‌ఆర్ డీన్ డాక్టర్ అల్ఫ్రెడ్ జె అగస్ట్రిన్, అసోసియేట్ డీన్ డాక్టర్ రమ్యా రామకృష్ణన్, కో-ఆర్డినేటర్ డా. వి.రాజేష్ కుమార్, ఫ్యాకల్టీ సభ్యులు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి క్లినికల్ చర్చలు విద్యార్థుల్లో విశ్లేషణాత్మక దృక్పథం, నిర్ధారణా నైపుణ్యాలను పెంపొందిస్తాయని, విభాగాల మధ్య జ్ఞాన మార్పిడి, వైద్యసేవల నాణ్యతను మరింతగా పెంచుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.





