నేటి సాక్షి, కరీంనగర్ క్రైం: గడువు ముగిసినా చిట్ మొత్తం చెల్లించకపోగా, సభ్యురాలిని బెదిరింపులకు గురిచేసిన కనకదుర్గ చిట్‌ఫండ్ చైర్మన్ రాగిడి తిరుపతిరెడ్డితో పాటు అతని అనుచరుడు రాజుపై కేసు నమోదు చేసినట్టు కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ విజయకుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లా గీతానగర్‌కు చెందిన ప్రస్తుతం కరీంనగర్ సుభాష్‌నగర్‌లో నివాసముంటున్న గడ్డం జమున(40) అనే మహిళ కరీంనగర్‌లోని ఐబీ చౌరస్తాలో ఉన్న కనకదుర్గ చిట్ ఫండ్‌లో చిట్కు సంబంధించి పూర్తి మొత్తం రూ.3 లక్షలు చెల్లించింది. చిట్కు సంబంధించి తనకు రావాల్సిన మొత్తాన్ని అడుగగా, హనుమకొండ జిల్లా గోపాలాపూర్కు చెందిన రాగిడి తిరుపతయ్య @ తిరుపతిరెడ్డి, అతని అనుచరుడు రాజు రెండు ఖాళీ బ్యాంకు చెక్కులు లు అందచేశారు. ఖాతాలో సరిపడా డబ్బు లేకపోవడంతో బ్యాంకు వారు చెక్కును తిరస్కరించారు. దీని గురించి బాధితురాలు చైర్మన్ తిరుపతిరెడ్డిని అడుగగా, డబ్బులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పాడు. మరోసారి డబ్బులు అడిగితే చంపేస్తామని తిరుపతి రెడ్డి బెదిరింపులకు గురిచేశాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ కేసు నమోదు చేసి, విచారణ అనంతరం తిరుపతిరెడ్డిపై ఐపీసీ సెక్షన్స్ 420, 406, 506 రెడ్ విత్ 34, తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెక్షన్-5 ప్రకారం కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరు పర్చి, రిమాండ్‌కు తరలించారు.