– అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి
నేటి సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో వారం రోజుల్లోగా సీఎం దృష్టికి తీసుకెళ్తానని అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, తెలంగాణ ప్రాంత రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు కామారపు మురళి పేర్కొన్నారు. కరీంనగర్లోని కొత్తపల్లిలో ఇటీవల చేనేత పనులు లేక ఆత్మహత్యకు పాల్పడిన బొల్లబత్తిని వెంకటేశం, సిరిమల్ల గణేశ్ కుటుంబాలను ఆదివారం రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించే దిశగా వారం రోజుల్లోగా సీఎం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని కోరారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని హితువు పలికారు. పద్మశాలి జాతీయ రాష్ట్ర సంఘం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. త్వరలోనే సిరిసిల్ల, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికుల సమస్యలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి జౌళి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల సమస్యలతో పాటు పద్మశాలి సంఘాలను బలోపేతం చేసేందుకు జిల్లాల వారీగా రాష్ట్ర కమిటీ అధ్యయన బృందం పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఐదు జిల్లాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, ఆ సమస్యలను తెలుసుకున్నట్టు పేర్కొన్నారు. చేనేతకు ప్రాధాన్యత కల్పించేందుకు, నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జౌళి శాఖ మంత్రి తెలిపినట్టు వివరించారు. మృతి చెందిన కుటుంబాలను రాష్ట్ర పద్మశాలి సంఘం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వారికి ప్రభుత్వం ద్వారా అందే ప్రయోజనాలను తొందరగా వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, పద్మశాలి సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మెతుకు సత్యం, రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ వాసాల రమేశ్, చేనేత సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కందగట్ల భిక్షపతి, పద్మశాలి సంఘం రాష్ట్ర మీడియా ప్రధాన కార్యదర్శి మార్త ప్రకాశ్, జిల్లా సంఘం నాయకులు స్వర్గం నర్సయ్య, వేముల చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు కమటం రాజేశం, నాయకులు పెంటి శేఖర్, పెంటి శ్రీకాంత్ తదితరులున్నారు.

