నేటి సాక్షి గజ్వేల్….సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో న్యాయవాదులు ఆగ్రహంతో రగిలిపోయారు. చేవెళ్లకు చెందిన అడ్వకేట్ స్వప్నను దారుణంగా హత్య చేసిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ గజ్వేల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.గజ్వేల్ కోర్టులో విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు పండరి, ఉపాధ్యక్షులు నరేష్ చారి మాట్లాడుతూ న్యాయవాదులపై జరుగుతున్న దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఇటువంటి సంఘటనలు న్యాయవ్యవస్థకు మచ్చతెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులు తమ విధులు నిర్వహించే సమయంలో భయాందోళనలకు గురికాకుండా ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని కోరారు.అడ్వకేట్ స్వప్న హత్యకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి కఠిన శిక్షలు విధించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేకంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.న్యాయవాదుల భద్రతకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ నిరసనకు గజ్వేల్ ప్రాంతానికి చెందిన పలువురు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు.





