-నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 23 ~అన్నమయ్య జిల్లా :-: చిత్తూరు మాజీ ఎంపీ, దివంగత డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు డీఏ శ్రీనివాస్, కుమార్తె కల్పజ అరెస్ట్ అయ్యారు. వివిధ నేరాల కింద వారిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని మార్తహళ్లిలో గల నివాసంలో వారిని అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అయిన వారిలో వారిద్దరితో పాటు కర్ణాటక మానవ హక్కుల కమిషన్ డీఎస్పీ మోహన్ కూడా ఉన్నారు. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి పలు ఆరోపణలను వారు ఎదుర్కొంటోన్నారు. కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఈ అరెస్టులు జరిగాయి. 2019 నాటి కేసులు ఇవి. డీకే ఆదికేశవులు నాయుడు సన్నిహితుడు కే రఘునాథ్ మరణంతో ఆరంభం అయ్యాయి. ఈ కేసులను మొదట బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని అభ్యర్థించారు. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో సీబీఐ రంగంలోకి దిగాల్సి వచ్చింది. బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆదికేశవులు నాయుడుకు భారీ ఆస్తులుండేవి. రఘునాథ్ కూడా బెంగళూరు పరిసర ప్రాంతాల్లో పలు స్థిరాస్తులకు యజమాని. 2013లో ఆదికేశవులు మరణానంతరం రఘునాథ్ ఆయనకు చెందిన అనేక ఆస్తులను తన ఆధీనంలోకి తీసుకున్నారు. వాటిని తమ పేర్ల మీద బదలాయించాలని, తండ్రి ఆస్తులకు తాము వారసులమని అప్పట్లో శ్రీనివాస్, కల్పజ, మరికొందరు, రఘునాథ్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు ఉన్నాయి. రఘునాథ్ పేరు మీదున్న ఆస్తుల ఆదాయ వనరులు సైతం తన తండ్రిదేనని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వాటిని కూడా తమకు బదిలీ చేయాలని పట్టుబట్టారు. ఈ సంఘటనల నేపథ్యంలో 2019 మేలో రఘునాథ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. రఘునాథ్ మరణం తర్వాత ఆయన కుమారుడు అసహజ మరణంగా కేసు నమోదు చేయగా 2020 ఫిబ్రవరిలో ఆయన భార్య సంచలనాత్మక ఆరోపణ చేశారు. ఆస్తి తగాదాల కారణంగా తన భర్తను శ్రీనివాస్ మరికొందరు హత్య చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తు సక్రమంగా సాగట్లేదని, తన పలుకుబడిని ఉపయోగించి శ్రీనివాస్, కల్పజ పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ రఘునాథ్ కుటుంబం ఆరోపించింది. ఈ కేసును సీబీఐకి బదలాయించాలంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీని తర్వాత ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. తాజాగా నిందితులను శ్రీనివాస్, కల్పజ , డీఎస్పీ మోహన్‌ను సీబీఐ అరెస్ట్ చేశారు. మంగళవారం న్యాయస్థానంలో హాజరు పరిచారు..రిమాండ్‌లో నిందితులు..————————కోర్టు వారికి డిసెంబర్ 29 వరకు రిమాండ్ విధించడంతో నిందితులను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. ఆదికేశవులు నాయుడు కుటుంబ సభ్యులపై ఈ స్థాయి యాక్షన్ తీసుకోవడం ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కర్ణాటకలోనూ పెద్ద చర్చకు దారితీసింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ పత్రికలైన ‘ది హిందూ’, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’, ‘డెక్కన్ హెరాల్డ్’ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఈ కేసు గురించి సంచలన కథనాలను ప్రచురించాయి.ఆ పత్రికలు ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఇవే..—————————–కేవలం ఆస్తి తగాదాలే కాకుండా, క్రిమినల్ కుట్ర, మోసం, విలువైన పత్రాల ఫోర్జరీ, ప్రభుత్వ స్టాంపులు, సీళ్ల ఫోర్జరీ, సాక్ష్యాల ధ్వంసం వంటి తీవ్రమైన అభియోగాలను సీబీఐ నమోదు చేసినట్లు పత్రికలు పేర్కొన్నాయి. 2019 మే 4న వైట్‌ఫీల్డ్‌లోని గెస్ట్‌హౌస్‌లో రఘునాథ్ ఉరివేసుకుని చనిపోగా, అప్పటి స్థానిక పోలీసులు దర్యాప్తును నీరుగార్చారని పత్రికలు రాశాయి. నిందితులు రఘునాథ్‌ను రెండు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి, హత్య చేసి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు వెల్లడించాయి.ఐటీ దాడుల నేపథ్యం:2016లో ఆదికేశవులు నాయుడు నివాసాలు, కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడుల వెనుక రఘునాథ్ ఉన్నారని శ్రీనివాస్, కల్పజ అనుమానించినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది. ఆ దాడుల్లో రూ.60 కోట్ల నగదు, రూ.250 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు దొరకడం వీరి మధ్య శత్రుత్వానికి ప్రధాన కారణమని వివరించాయి.పోలీస్ అధికారి ప్రమేయం..————————అప్పటి ఇన్స్ పెక్టర్ మోహన్ (ప్రస్తుత డీఎస్పీ) నిందితులకు అనుకూలంగా వ్యవహరించి, రఘునాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తప్పుడు ‘బి-రిపోర్ట్’ కోర్టుకు సమర్పించారని, ఈ కుట్రలో ఆయన పాత్రను సీబీఐ నిర్ధారించినట్లు పత్రికలు హైలైట్ చేశాయి. రఘునాథ్ ఆస్తులను కాజేయడానికి నిందితులు ఒక నకిలీ వీలునామాను సృష్టించారని, అందుకు అవసరమైన పాత స్టాంపు పేపర్లను ఫోర్జరీ చేశారని ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా సీబీఐ ధృవీకరించినట్లు పత్రికలు రాశాయి.డీకే కుటుంబ సభ్యులపై ఇతర కేసులు..మాదకద్రవ్యాల కేసు (2022)—————————–బెంగళూరులోని సదాశివనగర్ నివాసంలో డీఏ శ్రీనివాస్ డ్రగ్స్ వాడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన వద్ద భారీగా గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాలు దొరకడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.ఆస్తుల ఫోర్జరీ – ఫోరెన్సిక్ నివేదికరఘునాథ్ మరణం తర్వాత కొన్ని కీలక ఆస్తుల పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఆదికేశవులు నాయుడు బతికున్నప్పుడే ఆ ఆస్తులను తమకు రాసిచ్చినట్లు నిందితులు కొన్ని పత్రాలను సృష్టించారు. అయితే, అవి పాత తేదీలతో సృష్టించిన నకిలీ పత్రాలని, వాటిపై ఉన్న సంతకాలు ఫోర్జరీ చేసినవని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది.ఐటీ దాడులు – నగదు స్వాధీనం (2016)—————————–ఆదికేశవులు నాయుడు మరణం తర్వాత ఆదాయపు పన్ను శాఖ వీరి నివాసాలు, వైదేహి మెడికల్ కాలేజీపై మెరుపు దాడులు చేసింది. ఆ సమయంలో దాదాపు రూ. 43 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ సీట్ల కేటాయింపులో అక్రమాలు, పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ శాఖ పలు అభియోగాలు నమోదు చేసింది.ట్రస్టుల నిర్వహణలో వివాదాలు..—————————–వైదేహి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహణ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు సాగింది. ట్రస్టు ఆస్తుల అప్పగింత విషయంలో భాగస్వాములతో జరిగిన గొడవలే రఘునాథ్ మరణానికి మూలమని విచారణ సంస్థలు భావిస్తున్నాయి. ఈ పాత కేసులన్నింటినీ క్రోడీకరిస్తూ సీబీఐ పక్కా ఆధారాలు సేకరించింది. కేసును తప్పుదోవ పట్టించిన పోలీస్ అధికారుల పాత్రను కూడా బయటపెట్టింది..~~~~~~~~~~~~~~~~





