Friday, March 20, 2026

*జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి** దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత* జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్

నేటి సాక్షి,బాపట్ల జిల్లా ప్రతినిధి జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు పిలుపునిచ్చారు. డిసెంబర్ 13న శనివారం నాడు జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. లోక్‌ అదాలత్‌లో రాజీ చేయదగిన క్రిమినల్, సివిల్ వివాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులలో, కోర్టులు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మరియు జిల్లా పరిధిలోని పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా, రాజీ సాధ్యమైన కేసులకు ఇరుపక్షాల కక్షిదారులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు.ఇరు పక్షాల వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, జాతీయ మెగా లోక్‌ అదాలత్ గురించిన అవగాహన కల్పించాలని, వారి సమ్మతితో కేసులను పరిష్కరించాలని ఎస్పీ గారు పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులకు ప్రాధాన్యతనిస్తూ, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.నోటీసులు అందుకున్న కక్షిదారులు తమ కేసులను జాతీయ మెగా లోక్‌ అదాలత్‌లో రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మెగా లోక్‌ అదాలత్‌లో అనేక కేసులు రాజీ ద్వారా పరిష్కరించే అవకాశం ఉందని చెప్పారు. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకుంటే కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సిన శ్రమ, సమయం తగ్గుతాయని, ఖర్చు తగ్గి, సత్వర న్యాయం లభిస్తుందని తెలిపారు. అలాగే ఇరు పక్షాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.ఇప్పటికే జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, జాతీయ లోక్‌ అదాలత్ కార్యక్రమంపై కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ గారు తెలిపారు. జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలని కక్షిదారులను కోరారు. ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన లోక్‌ అదాలత్‌ ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News