నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల తీరు, నివారణ చర్యలు, హైవే ట్రామా కేర్ సెంటర్లు మరియు గోల్డెన్ అవర్ వైద్య సహాయంపై ఎంపీ అడిగిన ప్రశ్నలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు.*కేంద్రం సమాధానం :* దేశంలో 2019-23 మధ్య ఏటా సుమారు 4.3 నుండి 4.6 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్సీఆర్బీ గణాంకాలను మంత్రి వెల్లడించారు. ప్రమాద నివారణకు 4ఇ విధానం (ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ కేర్) అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 196 ట్రామా కేర్ సెంటర్లను ఆమోదించామని పేర్కొన్నారు.*ఈ సమాధానంపై స్పందించిన ఎంపీ గురుమూర్తి క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను వివరిస్తూ కేంద్ర మంత్రికి ప్రత్యేక లేఖ రాశారు.* *అతివేగం – ప్రమాదాలు* : 2023లో జరిగిన 4.64 లక్షల ప్రమాదాల్లో, 2.85 లక్షల ప్రమాదాలు అతివేగం వల్లే జరిగాయని ఎంపీ గుర్తుచేశారు. జాతీయ రహదారులపై స్పీడ్ డిటెక్షన్ సిస్టమ్‌లు పనిచేయకపోవడం వల్లే నియంత్రణ లోపిస్తోందని తెలిపారు. *మౌలిక సదుపాయాల కొరత* : బ్లాక్స్పాట్ల వద్ద సరైన సైనేజీలు, లైటింగ్ లేకపోవడం ప్రధాన సమస్యగా ఉందని పేర్కొన్నారు.*వైద్య సేవలలో జాప్యం* : ప్రభుత్వం ఆమోదించిన 196 ట్రామా కేర్ సెంటర్లలో చాలా వరకు నిపుణుల కొరతతో పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని, టోల్ ప్లాజా అంబులెన్స్‌లలో జీపీఎస్ లేకపోవడం వల్ల ‘గోల్డెన్ అవర్’లో చికిత్స అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. *క్యాష్‌లెస్ చికిత్స* : ఈ పథకం మంచిదే అయినప్పటికీ, ప్రజలకు అవగాహన లేకపోవడం, ఆసుపత్రుల ఎంపానెల్మెంట్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని తెలిపారు.*డిమాండ్లు* : తక్షణం జాతీయ రహదారులపై ‘స్వతంత్ర రోడ్డు భద్రత ఆడిట్ నిర్వహించాలని, ట్రామా సెంటర్లను బలోపేతం చేయాలని, అత్యవసర సేవలను ‘రియల్ టైమ్ మానిటరింగ్’ చేయాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర మంత్రిని కోరారు.





