Saturday, March 21, 2026

*జాతీయ స్థాయి స్విమ్మింగ్‌లో కానిస్టేబుల్‌ కు మెడల్ కైవసం** అభినందించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్

నేటి సాక్షి,బాపట్ల జిల్లా ప్రతినిధి పోలీస్ సిబ్బంది క్రీడల్లో కూడా సత్తా చాటాలని, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహిస్తామని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. స్విమ్మింగ్‌లో జాతీయ స్థాయిలో సత్తా చాటి బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ పి. నాగ బ్రహ్మారెడ్డిని గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అభినందించి, మెడల్ తో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.బాపట్ల జిల్లా పిజిఆర్ఎస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న 2013 వ బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ పి.నాగ బ్రహ్మారెడ్డి, స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో 2025 నవంబర్ 21 నుండి 23 వరకు నిర్వహించిన 21వ నేషనల్ మాస్టర్స్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ – 2025లో పాల్గొన్నారు. 400 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ను 6.44 నిమిషాలలో పూర్తి చేసి బ్రాంజ్ మెడల్‌ను సాధించాడు.జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పి.నాగ బ్రహ్మారెడ్డి స్విమ్మింగ్ పోటీల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటి బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడం అభినందనీయమన్నారు. గతంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని 15 మెడల్స్ సాధించి జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారని పేర్కొన్నారు. ఎంతో పట్టుదల, కృషి, సాధన ఉంటేనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే స్విమ్మింగ్ పోటీల్లో కూడా పాల్గొని సత్తా చాటాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ విధులు ఎంతో ఒత్తిడితో కూడుకున్నవని, పోలీస్ విధుల్లో విశ్రాంతి సమయం ప్రత్యేకంగా ఉండదని, శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండవలసి ఉంటుందన్నారు. క్రీడల ద్వారా మానసిక ఒత్తిడిని సులభంగా జయించవచ్చని, క్రీడల వల్ల శరీరం దృఢంగా మారడంతోపాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారు బ్రహ్మారెడ్డిని ఆదర్శంగా తీసుకొని క్రీడా పోటీల్లో పాల్గొని సత్తా చాటాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచే పోలీస్ అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తామని ఎస్పీ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News