నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, డిసెంబర్ 16: విజయవాడలోని పీఎస్సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన జాతీయ స్థాయి ముప్పై ఆరు గంటల హ్యాకథాన్ ‘మైండ్‌స్ప్రింట్–2025’లో ది అపోలో యూనివర్సిటీ విద్యార్థులు అద్భుత విజయాన్ని సాధించి జాతీయ వేదికపై తమ ప్రతిభను చాటుకున్నారు. బ్రెయినోవిజన్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, విద్యుత్–ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ల సంస్థ, ఇన్‌స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సహకారంతో నిర్వహించిన ఈ పోటీలకు దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల నుంచి సుమారు 2,400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.అపోలో యూనివర్సిటీకి చెందిన తొలి సంవత్సరం బీటెక్ కృత్రిమ మేధస్సు–డేటా సైన్స్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులతో పోటీపడి జాతీయ స్థాయిలో తమ సత్తాను చాటుకున్నారు. బయోమెడికల్ ‘మెడి మైండ్స్’ విభాగంలో వారు రూపొందించిన ‘ఆరోగ్యమిత్ర’ యాప్ జాతీయ స్థాయి తొలి బహుమతి దక్కించుకోగా, అన్ని విభాగాలు కలిపి మొత్తంగా అపోలో యూనివర్సిటీ విద్యార్థులకు జాతీయ స్థాయిలో ఆరవ స్థానం లభించింది.అపోలో యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ‘ఆరోగ్యమిత్ర్’ యాప్ గ్రామీణ ప్రాంతాలు, వైద్య సేవలు అందని మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రూపొందించబడటం విశేషం. వాయిస్ ఆధారితంగా, కృత్రిమ మేధస్సు సాయంతో పనిచేసే ఈ డిజిటల్ ఆరోగ్య సాధనం బహుభాషా మద్దతుతో, ఆఫ్‌లైన్‌లోనూ సేవలు అందించేలా రూపొందించారు. అనారోగ్య ప్రాథమిక లక్షణాల విశ్లేషణ, గాయాల పరిశీలన, ప్రాథమిక ఆరోగ్య సూచికల అంచనాల ద్వారా సమయానికి వైద్య సేవలకు అనుసంధానం కల్పించే సామర్థ్యంతో ఈ యాప్ జాతీయ స్థాయిలో నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ జాతీయ హ్యాకథాన్‌లో పాల్గొని విద్యార్థుల ఆవిష్కర్తలను ప్రోత్సహించినందుకు, ది అపోలో యూనివర్సిటీకి బ్రెయినోవిజన్ సొల్యూషన్స్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా అప్రిషియేషన్ సర్టిఫికెట్‌ను ప్రధానం చేశాయి. విజేతలుగా నిలిచిన తొలి సంవత్సరం బీటెక్ విద్యార్థులను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ హెచ్. వినోద్ భట్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. పోతరాజు అభినందించారు. ఈ విజయంతో అపోలో యూనివర్సిటీలో అమలవుతున్న ఆవిష్కరణలకేంద్రిత పాఠ్య ప్రణాళిక, బలమైన మార్గదర్శకత్వం, ఇన్నోవేషన్ సంస్కృతి స్పష్టమవుతున్నాయని వారు తెలిపారు. ఈ ఘనత ఇతర విద్యార్థులకు కూడా పరిశోధన, ఆవిష్కరణలు, సామాజిక ప్రయోజనాల దిశగా ముందుకు సాగేందుకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించేందుకు కృషి చేసిన స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డీన్ ప్రొ. డి. జగదీశన్, అపోలో ఇన్‌స్టిట్యూట్ ఇన్నోవేషన్ అండ్ ఇన్‌క్యుబేషన్ సెల్ కన్వీనర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. సుధీర్‌ను వారు ప్రత్యేకంగా ప్రశంసించారు.





