నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా మదనపల్లి, శర్మ ~అన్నమయ్య జిల్లా -:- రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర మనోవేదనను దృష్టిలో పెట్టుకునైనా ప్రభుత్వం స్పందించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజల ఆవేదనను అర్థం చేసుకొని, వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం గత రెండు రోజులుగా సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి 30 పేజీల డ్రాఫ్ట్ ను తయారు చేసి రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలనే ఉద్దేశంతో హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు వేసినట్టు శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై రాబోయే బుధవారం లోపు వాదనలు జరిగే అవకాశముందని తెలిపారు. రాయచోటి ప్రాంతానికి ప్రభుత్వం చేసిన అన్యాయంపై న్యాయస్థానాలు న్యాయం చేస్తాయనే పూర్తి నమ్మకం తమకుందన్నారు. జిల్లా కేంద్రం మార్పు విషయంలో రాయచోటి ప్రాంత ప్రజల అభిప్రాయాలను ఎక్కడా సేకరించలేదని, నోటిఫికేషన్లో కూడా వారి ప్రస్తావన లేకపోవడం గమనార్హమన్నారు. నిర్ణయం తీసుకునే ప్రక్రియలో విధి విధానాలను పూర్తిగా విస్మరించడం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాయచోటి ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా ప్రభుత్వం హడావిడిగా ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నందున, న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాయచోటి ప్రాంతానికి జరుగుతున్న ఈ ఘోర అన్యాయంపై న్యాయ పోరాటం తప్పనిసరిగా విజయవంత మవుతుందని, ప్రజల తరఫున మాతో కలిసి వచ్చే వారందరితో ఏకమై చివరి వరకు పోరాడుతామని గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ~~~~~~~~~~~~~~~~~

