నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):చందుర్తి మండలంలోని జోగాపూర్ గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన గడ్డం మల్లేశం నిర్వహిస్తున్న టిఫిన్ సెంటర్లో శనివారం ప్రమాదవశాత్తు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన బాధితులు డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందిన వెంటనే చందుర్తి బ్లూకోల్ట్ సిబ్బంది పీసీ ఎండీ. సమీ, హెచ్జీ. నజీర్ లు నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు మరింత వ్యాప్తి చెందకుండా, ప్రాణాలకు తెగించి తడి గోనె సంచులతో మంటలను కప్పి వేసి నేర్పుగా అదుపు చేశారు. పోలీసుల సకాలం స్పందనతో భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి సాహసోపేతంగా మంటలను ఆర్పిన బ్లూకోల్ట్ సిబ్బందిని చందుర్తి ఎస్సై జె. రమేష్, సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు. పోలీసుల చొరవను జోగాపూర్ గ్రామస్తులు కొనియాడారు.

