నేటి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేపటి నుంచి టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానున్నది. కోర్టు కేసులతో నిలిచిపోయిన బదిలీ, పదోన్నతులకు మోక్షం లభించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలను విద్యా శాఖ విడుదల చేసింది. టెట్‌తో సంబంధం లేకుండానే ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. పదవీ విరమణకి 3 ఏళ్లలోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపునిచ్చింది. మల్టీ జోన్–1లో రేపటి నుంచి ఈ నెల 22 వరకు బదిలీలు, పదోన్నతులు కల్పించనున్నారు. అలాగే మల్టీ జోన్ 2లో రేపటి నుంచి ఈ నెల 30 వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. ఇప్పుడు బదిలీ అయిన, ప్రమోషన్ పొందిన టీచర్లు ఈ విద్యా సంవత్సరం చివరి రోజున.. ప్రస్తుతం పని చేస్తున్న స్కూల్ నుంచి రిలీవ్‌కానున్నారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు, పదోన్నతులు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గైడ్ లైన్స్ విషయానికి వస్తే.. బదిలీకి కటాఫ్ తేదీ 1–2–2023గా నిర్ణయించారు. యాజమాన్యం వారీగానే బదిలీలు, పదోన్నతులు ఉండనున్నాయి. 1–2–2023 నాటికి ఒక పాఠశాలలో 2 సంవత్సరాల సర్వీస్ నిండిన వారు బదిలీ దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరుగుతాయి. ఎన్‌సీసీ ఆఫీసర్స్‌కు మాత్రం మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.. 01.02.2023 నాటికి ఒక పాఠశాలలో 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు, 8 సంవత్సరాల పూర్తి చేసిన ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ జరగనున్నాయి. ఇక, మూడు సంవత్సరాల లోపు రిటైర్ అయ్యేవారికి తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఉంటుంది.

