నేటి సాక్షి,బాపట్ల జిల్లా (కర్ల పాలెం)బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం యాజలి జిల్లా పరిషత్ హైస్కూల్లో పూర్వ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు జీవిత పాఠాలను బోధించారు. విద్యార్థుల ప్రవర్తన నియమావళిని, ఉన్నత స్థాయికి చేరడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రముఖ అబ్జర్వేషనల్ సైకాలజిస్ట్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ చే రూపొందించబడి ,భారత ప్రభుత్వ కాపీరైట్స్ డిపార్ట్మెంట్ నుండి పేటెంట్ హక్కులను పొందిన ప్రతిజ్ఞ పాఠం ఆవిష్కరణ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రతిజ్ఞలోని వివిధ అంశాలను విపులంగా విద్యార్థులకు వివరించి వారికి దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా నేటి తరం విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల భక్తిశ్రద్ధలు కలిగి ఉండాలని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని, సమాజంలో ఉన్నత స్థితికి చేరిన తర్వాత సమాజం కోసం మరల కొంత సమయాన్ని వెచ్చించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విద్యార్థులకు సూచించారు. బద్ధకం నిర్లక్ష్యం అనే రెండు ప్రధాన శత్రువులను జయిస్తే ప్రపంచంలో దేనినైనా జయించవచ్చు అని విద్యార్థులకు హితవు పలికారు. నేటితరం విద్యార్థుల అభ్యున్నతికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ క్లాసులు ఎంతగానో ఉపయోగపడతాయని , విద్యార్థుల్లో మంచి మార్పుల కోసం కృషి చేస్తున్న అబ్జర్వేషనల్ సైకాలజిస్ట్ శ్రీమన్నారాయణ ను పలువురు అభినందించారు.శాసనసభ్యలు వేగేశన నరేంద్ర వర్మ రాజు చెప్పిన జీవిత పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా ఆలకించి ఈ విషయాలను క్రమం తప్పకుండా పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. సుగుణమణి, పూర్వ విద్యార్థి సంఘం సభ్యులు పెనుమత్స నాగరాజు (చిన్నబాబు) పేరాల రమేష్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.





