నేటి సాక్షి,,నారాయణపేట, డిసెంబర్ 10, నారాయణపేట జిల్లాలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం సందర్శించారు. ముందుగా మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 11 జిల్లాలోని మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్, కోస్గి మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, పోలింగ్ అవసరమైన సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో తీసుకున్న సిబ్బంది ఒకటికి రెండుసార్లు సామాగ్రిని సరి చూసుకోవాలని సూచించారు. బ్యాలెట్ పత్రాలు, బాక్సులు చెక్ చేసి ప్యాక్ చేసుకోవాలని, పోటీ చేసే అభ్యర్థుల కు సమానంగా గుర్తులు ఉన్నాయా లేదా నిశితంగా పరిశీలించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల సిబ్బందికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం వసతి కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే పోలింగ్ కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటల సరఫరా ఉండేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, ఎంట్రీ, ఎగ్జిట్ , తాగునీరు, మరుగు దొడ్ల సౌకర్యం ఉండాలన్నారు. జిల్లాలో మూడు విడతలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొదటి విడత లో జరిగే ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరిగితే మిగతా రెండు విడతలు కూడా అదే విధంగా జరుగుతాయని ఆమె తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. అనంతరం కలెక్టర్ కోస్గి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో గల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ పోలింగ్ సిబ్బందికి తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా, పీ.ఓ, ఓ.పీ.ఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని ఆర్ఓలకు సూచించారు. పోలింగ్ సామాగ్రిని సర్దుకుని కేంద్రంలో భోజనం చేస్తున్న పీవోలు, ఓపివోల వద్దకు వెళ్ళిన కలెక్టర్ భోజనం చేశాక మరోసారి పోలింగ్ సామాగ్రినీ సరిచూసుకోవాలని తెలిపారు. భోజనం బాగుందా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ అధికారులు, సిబ్బందికి ఆమె బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. జిల్లా అదనపు కలెక్టర్లు వెంట అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, శ్రీను కొత్తపల్లి, గుండుమల్ మండల కేంద్రాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరు తెన్నులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ డీ సీ రాజేందర్ గౌడ్, డిఆర్డిఓ మొగులప్ప, ఆయా మండల ల తహాసిల్దారులు, ఎంపీడీవోలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





