నేటి సాక్షి – కథలాపూర్*( రాధారపు నర్సయ్య )*ఎన్నికల ఫలితాలు.. కుటుంబాన్ని కుదిపేశాయి*జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్ పూర్ గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. గ్రామ మాజీ సర్పంచ్ పోతు రాజశేఖర్ మరోసారి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవగా, గురువారం జరిగిన మొదటి విడత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓటమిపాలయ్యారు. ఈ వార్తను తట్టుకోలేక ఆయన అక్క కొక్కుల మమత (38) తీవ్ర మానసిక కలతకు గురయ్యారు.*ఛాతినొప్పితో కుప్పకూలిన మమత*రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కొక్కుల మమత ప్రస్తుతం కోరుట్ల పట్టణంలో నివాసం ఉంటోంది. తమ్ముడు రాజశేఖర్ ఎన్నికల నేపథ్యంలో తన పుట్టినిల్లు అయిన గంభీర్ పూర్ గ్రామానికి వచ్చారు. అయితే తమ్ముడు ఓడిపోయాడనే బాధను పదేపదే మనసులో మోసుకుంటూ దిగులుతో ఉన్న మమతకు అకస్మాత్తుగా ఛాతినొప్పి రావడంతో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.*విషాదంలో కుటుంబం, గ్రామస్తులు*మమత భర్త ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాలో ఉంటుండగా, ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ విషాద ఘటనతో గంభీర్పూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఓ కుటుంబాన్ని ఇలా కుదిపేయడం గ్రామస్తులను కలిచివేసింది. మమత మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, గ్రామస్తులు పెద్ద ఎత్తున సంతాపం తెలిపారు.____





