నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని యర్రావారిపాళ్యం మండలం తలకోన జలపాతం, శేషాచలం పర్వత ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీటిని సంరక్షించేందుకు ప్రభుత్వ స్థాయిలో సమగ్ర చర్యలు చేపట్టాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చంద్రగిరి నియోజకవర్గం ఇన్చార్జ్ దేవర మనోహర్ విజ్ఞప్తి చేశారు. తగిన నీటి నిల్వ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రతి సంవత్సరం లక్షల క్యూసెక్కుల నీరు వృథా అవుతుందని, ఫలితంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తాగునీరు—సాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నాయని పేర్కొన్నారు.తలకోన నుంచి గాజులేరు, కప్పలేరు, వలసపల్లి ఏరు మార్గంగా ప్రవహించే వర్షపు నీరు చివరకు పింఛా ప్రాజెక్టుకు చేరుతుందని, కానీ నిల్వ సదుపాయాల కొరత కారణంగా పెద్ద మొత్తంలో నీరు సముద్రంలో కలిసిపోతుందని వివరించారు. మరోవైపు పైప్రాంత గ్రామాల్లో భూగర్భ జల మట్టం తగ్గిపోవడం, బోరు బావులు ఎండిపోవడం, పంటలు నష్టపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ప్రాంతంలో సారవంతమైన భూములు విస్తారంగా ఉన్నప్పటికీ, అనిశ్చిత వర్షాలపై ఆధారపడక తప్పడం లేదంటున్నారు. నీటి కొరత కారణంగా వలసలు పెరుగుతున్నాయని, గ్రామీణ కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన పలు సూచనలు గురించి వివరించారు.— తలకోన అటవీ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీటిని నిల్వ చేసే ఆనకట్టలు/రిజర్వాయర్లు నిర్మించడం.— ఇప్పటికే ఉన్న నిర్మాణాలను బలోపేతం చేసి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం.— నిల్వ నీటిని చెరువులు, కాలువల ద్వారా పంపిణీ చేసి సుమారు 750 చెరువులకు ప్రయోజనం చేకూరేలా చేయడం.— భూగర్భజలాలను పునఃభర్తీ చేస్తూ తాగునీటి లభ్యతను మెరుగుపరచడం.“ఈ చర్యలు అమలు అయితే మూడు జిల్లాల రైతులకు సాగునీరు లభించి, తాగునీటి భద్రత కలుగుతుంది. స్థిరమైన నీటి నిర్వహణలో ఇది ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుంది” అని వినతిపత్రంలో పేర్కొన్నారు. దీర్ఘకాలిక మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారిస్తే, భవిష్యత్తు తరాలకు నీటి భద్రత కల్పించవచ్చని దేవర మనోహర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

