- – కూతురితో భర్త అసభ్య ప్రవర్తన
- – గొడ్డలితో నరికి చంపిన భార్య
నేటి సాక్షి, అందోల్: కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన భర్తను భార్య దారుణంగా హతమార్చింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకుర్ మండలం సుల్తాన్‌పూర్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. సుల్తాన్‌పూర్‌కు చెందిన మన్నే మానయ్య(45)–ఇందిరా దంపతులకు సుకన్య అనే కూతురు ఉంది. ఏడాది క్రితం సుకన్య భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటున్నది. మద్యానికి బానిసైన మానయ్య తన ఇంట్లో ఉంటున్న కూతురిపై కన్నేశాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాకా తాగి వచ్చి భార్య, కూతురితో గొడవకు దిగాడు. కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. గొడ్డలి తీసుకొని సుకన్యను బెదిరిస్తూ దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న ఇందిరా అతనిని అడ్డుకొని, కూతురిని లోనికి వెళ్లాలని చెప్పింది. మానయ్య చేతిలో ఉన్న గొడ్డలిని లాక్కొని, అతనిని నరికి చంపింది. అర్ధరాత్రి విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం శవాన్ని సంగారెడ్డి దవాఖానకు తరలించారు. ఉదయం క్లూస్‌టీమ్ మానయ్య ఇంట్లో శాంపిల్స్ సేకరించింది. కేసు నమోదు చేసుకున్నట్టు సీఐ తెలిపారు.