దళితవాడల్లో శ్రీ వాణి నిధులతో ఆలయాలు నిర్మాణం..
టిటిడి పాలకమండలి పలు కీలక నిర్ణయాలు..
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్ లో పాలక మండలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బి.ఆర్ నాయుడు, పాలకమండలి సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, నరేష్ కుమార్, శాంతారాం, జానకిదేవి లతో కలిసి మీడియాతో మాట్లాడారు. తిరుపతి విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర ఎయిర్పోర్టుగా నామకరణం చేసాం ఈ తీర్మానాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీఅఫ్ ఇండియా కి పంపిస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరులో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడానికి అక్కడే ప్రభుత్వం ముందుకు వచ్చి స్థలాన్ని ఇవ్వడానికి సుముఖంగా ఉందని త్వరలోనే ఆలయాన్ని నిర్మిస్తామని తెలియజేశారు. అదేవిధంగా కేంద్రమంత్రి కుమార్ స్వామి సెంట్రల్ ఫండ్ ద్వారా టిటిడి కి 100 ఎలక్ట్రికల్ బస్సులు ఉచితంగా ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారని వాటిని తిరుపతికి తీసుకురావడానికి తీర్మానం చేశామన్నారు. సి ఎస్ ఐ ఆర్ ల్యాబ్ ను తిరుపతిలో ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ముందుకు వచ్చిందని త్వరలోనే ల్యాబ్ ఏర్పాటుకు స్థలాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు. 1952లో ఢిల్లీలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల భవనాల పునర్నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మం వ్యాప్తి కోసం టిటిడి ధర్మ ప్రచార పరిషత్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని ఇందుకోసం ఏడాదికి 120 కోట్లు ఖర్చు చేస్తున్నదని వివరించారు. శ్రీ వాణి ట్రస్ట్ నిధుల ద్వారా దళితివాడల్లో ఆలయాలు నిర్మించడానికి తీర్మానం చేశామన్నారు. ఇప్పటికే ఒక్క చిత్తూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో 141 ఆలయాల నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించామన్నారు. టిటిడి కళాశాలలో ఏళ్ల తరబడి లెక్చరర్లుగా పనిచేస్తున్న వారికి ప్రాధాన్యతను ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారని అందుకోసం దేవాదాయ శాఖ మంత్రి, టిటిడి ఈఓ,టిటిడి చైర్మన్ లు కమిటీగా ఏర్పడి చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మరి కొన్ని నిర్ణయాలకు కూడా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు వెల్లడించారు.

