నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) తిరుపతి పార్లమెంట్ పరిధిలో జవహర్ నవోదయ విద్యాలయం అవసరం ఉందని గుర్తించిన ఎంపీ మద్దిల గురుమూర్తి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇటీవల జవహర్ నవోదయ విద్యాలయ సమితికి లేఖ రాశారు. తిరుపతిలో ఐఐటీ, ఐజర్ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఉన్నప్పటికీ, గ్రామీణ విద్యార్థులకు స్కూల్ స్థాయిలో నాణ్యమైన విద్యా అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఎంపీ ఆ లేఖలో పేర్కొన్నారు.గ్రామీణ, పేదరికంలో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో నవోదయ విద్యాలయాలు ఎంతో కీలకమని ఎంపీ అధికారులకి వివరించారు. ఎంపీ చేసిన విజ్ఞప్తికి స్పందించిన నవోదయ విద్యాలయ సమితి, ప్రతి జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం ఉండాలనే పథకం ఉన్నప్పటికీ కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో ఇంకా ఈ పాఠశాల లేని విషయం గుర్తించింది నవోదయ విద్యాలయం ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన స్థలాన్ని ఉచితంగా కేటాయించాల్సి ఉంటుందని, శాశ్వత భవనం నిర్మాణం అయ్యేవరకు తాత్కాలిక భవనాన్ని కూడా రాష్ట్రం అందించాల్సి ఉంటుందని నవోదయ విద్యాలయ సమితి స్పష్టం చేసింది. తిరుపతి జిల్లాను కూడా నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు పరిశీలన్లో భాగంగా పరిగణించనున్నట్లు కేంద్రం ఎంపీకి ఇచ్చిన లేఖలో పేర్కొంది. ఎంపీ గురుమూర్తి లేఖ అనంతరం సదరు శాఖలో కదలికల ప్రారంభమైంది. తిరుపతి జిల్లాలో నవోదయ విద్యాలయ ఏర్పాటు కోసం అనువైన స్థలం కేటాయించేందుకు పరిశీలన ప్రస్తుతం జరుగుతోంది.త్వరలోనే నవోదయ విద్యాలయం తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ ఏర్పాటు అవుతుందని ఎంపీ గురుమూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.





