నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి నగరంలో మద్యాన్ని, గంజాయిని అరికట్టి మహిళలకు రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి బి నదియా డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఎన్ఎఫ్ఐడబ్ల్యు తిరపతి నగర ముఖ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బి నదియా మాట్లాడుతూ తిరుపతి నగరంలో ప్రభుత్వం విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంతో, మద్యం దుకాణాల ముందే మద్యం గంజాయి తాగి విచ్చలవిడిగా మహిళలపై దాడులు చేస్తున్నారని, రోజురోజుకు తిరుపతి నగరంలో రౌడీ మూకలు మహిళలపై, ప్రజలపై దౌర్జన్యాలు చేస్తున్నారని మహిళలు రోడ్లపై రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు, హోంమంత్రి తిరుపతి నగరం పై ప్రత్యేక దృష్టి పెట్టి డీఎస్పీ స్థాయిలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి తిరపతి నగరాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. రాయలసీమకే పేరు ప్రఖ్యాతలు కాంచిన ప్రసూతి ఆస్పటల్ మహిళలకు సరైన వైద్యం అందించక, ఒక్కొక్క బెడ్ పై ఇద్దరు ముగ్గురు మహిళలను పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారని దీనివలన గర్భిణీ స్త్రీలు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గతంలో పాత ప్రసూతి భవనాన్ని మున్సిపల్ కార్యాలయానికి కేటాయించాలని ప్రకటిస్తే పెద్ద ఎత్తున మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిరసన తెలియజేసి భవనాన్ని కాపాడమని, ఇప్పుడు ఆ భవనంలో కొన్ని ఫ్లోర్స్ ఖాళీగా ఉన్న కొత్త భవనంలోనే వైద్యం అందిస్తూ బెడ్స్ లేకపోయినా ఒక్కొక్క బెడ్ పై ఇద్దరిని పండబెట్టడం వల్ల మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని దుయ్యబట్టారు. ప్రసూతి హాస్పిటల్ లో మహిళలకు మౌలిక సదుపాయాలు కల్పించి మెరుగైన వైద్యం అందించకపోతే పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తిరుపతి నగరంలో మహిళలకు ఏ సమస్య వచ్చినా ఎన్ఎఫ్ఐడబ్ల్యు ముందుండి పోరాటం సాగిస్తుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్ష కార్యదర్శులు సి రత్నమ్మ, ఎన్ మంజుల, విజయ, హరిత, అలివేలమ్మ, ప్రియా, వాణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.




