Monday, March 23, 2026

తిరుమల కొండపై మరో సారీ భద్రత వైఫల్యం..అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేయాల్సిన విజిలెన్స్ అధికారుల అలసత్వం.. శిలాతోరణం వద్ద డ్రోన్ కలకలం..

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 05 ~అన్నమయ్య జిల్లా :-: హిందువులు శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా భావించే కలియుగ వైకుంఠ నాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం మరో మారు వివాదాల్లో చిక్కుకుంది. శ్రీవారి ఆలయానికి కొద్ది దూరంలో డ్రోన్‌ కెమెరా కలకలం రేపింది. ఆలయ పరిసరాల్లో డ్రోన్‌ను ఎగురవేయడం ద్వారా మరో మారు భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం శిలాతోరణం సమీపంలో చోటుచేసుకుంది. తిరుమల శిలాతోరణం దగ్గర డ్రోన్ ఎగరడం గమనించిన స్థానికులు విజిలెన్స్ అధికారులకు సమాచారమందించారు. విజిలెన్స్ అధికారులు వచ్చే లోపు డ్రోన్ ఎగరవేసిన వ్యక్తిని పట్టుకొని విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. అప్రమత్తమైన సిబ్బంది ఆ వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేసి డ్రోన్ కెమెరా గుర్తించారు. ఆ డ్రోన్‌ను స్వాధీన పరుచుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ ఎగరేసిన భక్తుడు ప్రవాస భారతీయుడు జైపూర్ కు చెందిన సుభం ఖండేవాల్ న్యూయార్క్ లో స్థిరపడినట్టు గుర్తించారు. అలిపిరి చెక్ పాయింట్ లో నిరంతరం కట్టుదిట్టమైన తనిఖీలు జరుగుతుంటాయి. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి డ్రోన్ ను తిరుమలకు తీసుకొచ్చినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. దీంతో అలిపిరి చెక్ పాయింట్ లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాల్సిన భద్రత అధికారులు ఏం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు కొందరు వాదిస్తే మరి కొందరేమో నిద్రలో జోగుతున్నారంటూ వారి తీరుపై మండిపడుతున్నారు. హిందువుల పవిత్రమైన తిరుమల కొండ విషయంలో తరచూ ఏదో ఒక దురదృష్ట ఘటన చేసుకొంటుంది. నిభందనలకు విరుద్ధంగా డ్రోన్ కెమరాను తిరుమలకు తీసుకొచ్చిన ఎన్ఆర్ఐ భక్తుడిని విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. తిరుమల క్షేత్రం అత్యంత సున్నితమైన మరియు రక్షణ ప్రాధాన్యత ఉన్న ప్రాంతం కాబట్టి, ఇక్కడ డ్రోన్‌లను, ఇతర వైమానిక వస్తువులను ఎగురవేయడంపై నిషేధం ఉంది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తూ భక్తుడు డ్రోన్‌ను ఉపయోగించడంపై విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. భద్రత విషయంలో నిరంతర నిఘా ఉన్నప్పటికీ డ్రోన్ దర్శనమివ్వడం పట్ల భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా టీటీడీ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు. తిరుమల కొండపై విమానాలు, డ్రోన్లు వంటివి ఎగరడం ఇది కొత్తేమి కాదు. గతంలో కూడా పలు మార్లు తిరుమల కొండపై విమానాలు, డ్రోన్లు ఎగరడం కలకలం రేపింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం పట్ల శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News