నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: తిర్యాణి మండలంలోని TGTWURJC (గర్ల్స్) స్కూల్, గంబీరావుపేట గ్రామ అంగన్వాడీ కేంద్రం, MPUPS పాఠశాలలలో బాలబాలికలకు భరోసా టీం ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించబడినవి.జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, చిత్తరంజన్ ఎఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా భరోసా టీం ఇంచార్జ్ మహిళా ఎస్‌ఐ తిరుమల గారు మాట్లాడుతూ,భరోసా సెంటర్లు బాలబాలికలకు మరియు మహిళలకు ఎలాంటి సహాయాన్ని అందిస్తాయో వివరించారు. అత్యాచార బాధితులకు భరోసా సెంటర్ అండగా ఉంటుందని, అక్కడ బాధితులకు అందించే వైద్య, న్యాయ, కౌన్సెలింగ్ సేవలపై అవగాహన కల్పించారు.అనంతరం భరోసా లీగల్ కౌన్సిలర్ మాట్లాడుతూ,బాలికలకు సేఫ్ టచ్ – అన్‌సేఫ్ టచ్, పోక్సో చట్టం, పోక్సో చట్టం ప్రకారం అమలులో ఉన్న శిక్షలు, బాల్య వివాహ నిరోధక చట్టం గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, విద్య ద్వారానే సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, ప్రస్తుత సమాజ పరిస్థితులపై జాగ్రత్తగా ఉండటం ఎంత ముఖ్యమో వివరించారు.అలాగే మొబైల్ ఫోన్ల వినియోగంలో ఉన్న లాభాలు – నష్టాలు, ముఖ్యంగా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే ముందు ఆలోచన అవసరమని సూచించారు.జిల్లాలో మహిళల రక్షణ కోసం షీ టీంలు మరియు భరోసా సెంటర్లు నిరంతరం పనిచేస్తున్నాయని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు.అలాగే భరోసా హెల్ప్‌లైన్ నెంబర్: 8712670561 ను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు భరోసా టీం సభ్యులు పాల్గొన్నారు.

