నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుమల తరహాలో ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈనెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంతో పాటు గ్రామ పరిసరాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ పరిసరాల్లో పనులు ప్రారంభం చేయగా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లుపై ఉత్సవ కమిటీ సభ్యులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా వివిధ రకాల పుష్పాలంకరణలు, విద్యుత్తు వెలుగులు మద్యన ఆలయం కనువిందు చేయనుంది. దేశ, విదేశాల నుంచి 108 రకాల పుష్పాలు తెప్పిస్తున్నారు. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ దీపాల అలంకరణలు, పలు రకాల పండ్లు, పచ్చని పందిళ్లు భక్తులకు స్వాగతం పలికేందుకు తుమ్మలగుంట ఆలయం ప్రత్యేకంగా ముస్తాబవుతోంది. *జిల్లా నలుమూలల నుంచి..*తిరుమల శ్రీవారి ఆలయంలో తెరచుకునే వైకుంఠ ద్వారంలో వెళ్లలేని భక్తులు అదే రీతిలో ఏర్పాటు చేస్తున్న తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ వైకుంఠ ద్వారం దర్శనానికి వస్తుంటారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధికంగా తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఆలయ నిర్వాహకులు అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన ప్రత్యేకంగా అభిషేకం, పూజాదికాలను నిర్వహించనున్నారు. . *ఏర్పాట్లుపై చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సమీక్ష*వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లుపై ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆలయ సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులతో కలసి ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశికి చేపట్టే ఏర్పాట్లు పనుల నిర్వహణపై ఆరా తీశారు. ఇప్పటికే ఆలయం వద్ద తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌తో పాటు చంద్రగిరి డీఎస్పీ కార్యాలయంలో లేఖను అందించారు. పోలీసుల సూచనల మేరకు ఆలయం ముందు సమీపంలో ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలో అధిక రద్దీ ఏర్పడిన సమయంలో భక్తుల నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఆరా తీశారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో నల్లందుల సుబ్బరామిరెడ్డి, పలువురు అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.





