నేటి సాక్షి శ్రీధర్ (మంచిర్యాల్ )మార్చ్ 7 :పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య అభివృద్ధి – భద్రతా నిబంధనలు తప్పనిసరి*ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని రాబోయే సంవత్సరాల్లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి జీ. వివేక్ వెంకటస్వామి. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులు మరియు ఇతర భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నదని మంత్రి తెలిపారు.శనివారం హైదరాబాద్లో Confederation of Indian Industry (సీఐఐ) నిర్వహించిన వార్షిక సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొత్త పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడానికి ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందించేందుకు ఉపాధి శాఖ ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs) ఏర్పాటు చేసారని తెలిపారు. భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై సీఐఐతో కూడా చర్చలు జరిపినట్లు చెప్పారు.తెలంగాణలో పెట్టుబడులు స్థిరంగా పెరుగుతున్నాయని, త్వరలోనే అనేక కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో స్థాపించబడనున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ పరిశ్రమల అవసరాలను తీర్చగల నైపుణ్యంతో కూడిన మానవ వనరులను సిద్ధం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. పరిశ్రమల మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త శిక్షణ కోర్సులను కూడా ప్రవేశపెడుతున్నామని తెలిపారు.పెట్టుబడులను ఆకర్షించడంలో Ease of Doing Business మాత్రమే కాకుండా Speed of Doing Business కూడా సమానంగా ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నప్పటికీ, పరిశ్రమలు కూడా నిబంధనలు, ప్రమాణాలను స్వచ్ఛందంగా పాటించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.పరిశ్రమలు భద్రతా మార్గదర్శకాలు మరియు చట్టబద్ధ నిబంధనలను కచ్చితంగా పాటించాలని మంత్రి కోరారు. భారత ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పరిశ్రమలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త కార్మిక చట్టాలను పరిశ్రమలు తప్పనిసరిగా పాటించాల్సిందిగా సూచించారు. భద్రతా ప్రమాణాలు, చట్టబద్ధ నిబంధనలు పాటించడానికి అయ్యే వ్యయం తక్కువే అయినప్పటికీ, నిర్లక్ష్యం వల్ల కలిగే నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకట్ స్వామి గారు చేసిన సేవలను మంత్రి స్మరించారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలని ఆయన అప్పట్లో ప్రతిపాదించినప్పుడు పరిశ్రమల నుంచి కొంత వ్యతిరేకత ఎదురైనా, నేడు అది కార్మికులకు ఎంతో ప్రయోజనకరమైన సామాజిక భద్రతా పథకంగా నిలిచిందని అన్నారు.రాష్ట్రంలో స్థిరమైన పారిశ్రామికాభివృద్ధి మరియు కార్మికుల సంక్షేమం కోసం పరిశ్రమలు ప్రభుత్వంతో కలిసి పనిచేసి చట్టబద్ధ నిబంధనలను పూర్తిగా పాటించాలని మంత్రి పిలుపునిచ్చారు.





