ఆర్ఎంపి వైద్యం వికటించడంతోనే మృతి చెందిందని తల్లిదండ్రుల ఆవేదన
ఏరియా ఆసుపత్రిలో బాలిక మృతదేహాన్ని పరిశీలించిన అడిషనల్ ఎస్పీ
నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):
చందుర్తి మండలంలోని కిష్టంపేట గ్రామంలో వైద్యం విఫలమై ఓ ఎనిమిదేళ్ల బాలిక మృతిచెందిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. గ్రామానికి చెందిన కుదూరిక మహళ (8) అనే చిన్నారి ఈ నెల 19న తేలు కాటుకు గురైనట్టు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో తల్లిదండ్రులు ఆర్.ఎం.పీ డాక్టర్ సంజీవ్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా, డాక్టర్ సంజీవ్ వెంటనే వచ్చి బాలికకు రెండు కాళ్లలో రెండు ఇంజెక్షన్లు వేశారు. “ఏమీ కాదు, త్వరలో నయం అవుతుంది” అంటూ ఇంటికి వెళ్లిపోయినట్టు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అయితే, మరుసటి రోజు ఉదయం మహళ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, సంజీవ్ సూచన మేరకు ఆమెను వేములవాడలోని ఓ పిల్లల ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితిని గమనించి, నాడీ వ్యవస్థ బలహీనమైందని గుర్తించారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రతిమ ఆసుపత్రికి తరలించారు. ప్రతిమ ఆసుపత్రిలో మహళను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించినప్పటికీ, ఆరోగ్యం క్షీణించి శనివారం ఉదయం మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య వేములవాడ లో బాలిక మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అయన వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్ ఉన్నారు. డాక్టర్ నిర్లక్ష్యమే బాలిక మృతికి కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.





